హెల్మెట్ లేకుండా సీఎం బైక్ రైడింగ్‌...వైర‌ల్‌!

Update: 2017-10-21 05:36 GMT
ఆ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాలన్నా క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ ఉంటుంది.....ఆఖ‌రికి త‌న ప్రేయ‌సితో మాట్లాడేందుకు కూడా ప్రైవ‌సీ ఉండ‌దు...దీంతో..త‌న ప్రేయ‌సిని క‌లిసేందుకు సీఎం మారు వేషం వేసుకొని వెళ్తారు.... ఇవి ఒకే ఒక్క‌డు(హిందీలో నాయ‌క్‌) సినిమాలోని స‌న్నివేశాలు. ఆ నాయ‌క్ సినిమాను చూసి జార్ఖండ్ సీఎం ర‌ఘ‌బ‌ర్ దాస్ ఇన్ స్పైర్ అయిన‌ట్టున్నారు. అందుకే దీపావ‌ళి నాడు త‌న ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బైక్ రైడింగ్ చేశారు. కేవ‌లం కొద్దిమంది బంధువులు - మ‌ద్ద‌తుదారులతో పాటుగా జార్ఖండ్ రోడ్ల‌పై  చ‌క్క‌ర్లు కొట్టారు. అయితే, ఆ సినిమాలో లాగా ఆయ‌న ప్రేయ‌సిని క‌ల‌వ‌డానికి వెళ్ల‌లేదు.... త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు ఈ బైక్ రైడింగ్ చేశారు.

జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్....త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం జంషెడ్‌ పూర్‌ లోని తన నివాసంలో దీపావ‌ళి వేడుక‌ల‌ను జరుపుకున్నారు. ఆ తర్వాత టూ వీలర్స్‌ పై న‌గ‌ర‌మంతా చక్కర్లు కొట్టారు. ఆ స‌మ‌యంలో ఆయన వెంట ఆయన వెంట కనీసం పోలీసులు లేరు. కేవ‌లం బంధువులు - పార్టీ మద్దతుదారులు మాత్రమే ఉన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌ను పండుగ‌పూట క‌లిసేందుకే సీఎం వెళ్లారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా...సాక్ష్యాత్తూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ రైడ్ చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జార్ఖండ్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఇర‌కాటంలో ప‌డింది. త‌మ సీఎంకు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు య‌త్నిస్తోంది.

ర‌ఘుబ‌ర్ దాస్ బైక్ రైడింగ్ పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. గ‌తంలో త‌ప్పనిస‌రిగా హెల్మెట్ పెట్టుకుని వాహనాలు న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం పెద్ద పెద్ద హోర్డింగ్ ల‌తో ప్ర‌చారాన్ని హోరెత్తిచింద‌ని రాష్ట్ర కాంగ్రెస్ సెక్ర‌ట‌రీ కిషోర్ తెలిపారు. సీఎం హెల్మెట్ పెట్టుకొని బైక్ న‌డుపుతున్నారు....మ‌రి పౌరులు ఎందుకు న‌డ‌ప‌రు అంటూ....సీఎం ఫొటోతో అప్ప‌ట్లో హోర్డింగులు పెట్టిన సంగ‌తి ఆయ‌న గుర్తు చేశారు. అయితే, పండుగ పూట‌ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌నే స‌దుద్దేశ్యంతో సెక్యూరిటీ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని బీజేపీ ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు. ఆ స‌మ‌యంలో ట్రాఫిక్ కూడా లేద‌ని, ఈ అంశాన్ని స‌దుద్దేశ్యంతో చూడాల‌ని చెప్పారు. మీడియా కేవలం ఒక కోణంలో మాత్ర‌మే ఈ విష‌యాన్ని చూడడం స‌రికాద‌న్నారు. మ‌రోవైపు సీఎం ఇంత బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తే...సామాన్య ప్ర‌జ‌లు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఎలా పాటిస్తార‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ర‌ఘుబ‌ర్ దాస్ బైక్ రైడింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఏడాది ఆగ‌స్టులో  పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ పై కూడా ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పుదుచ్చేరిలో రాత్రి వేళ‌ మ‌హిళ‌ల భ‌ద్ర‌త గురించి స్వ‌యంగా తెలుసుకోవాల‌ని కిర‌ణ్ బేడీ...ఓ మ‌హిళ హెల్మెట్ ధ‌రించ‌కుండా న‌డుపుతున్న బైక్ పై కూర్చొని ప్ర‌యాణించారు. దీంతో, నెటిజ‌న్లు కిర‌ణ్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

Full View
Tags:    

Similar News