ఆపరేషన్ జార్ఖండ్: 'రూ.10 కోట్లు, మంత్రి పదవి.. అసోం సీఎంతో మీటింగ్!'

Update: 2022-08-01 03:45 GMT
భారీగా నోట్ల కట్టలతో పట్టుబడిన జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనుక‌.. బీజేపీ ఉంద‌ని.. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఆరోపించ‌డం.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. జార్ఖండ్‌లో జేఎంఎంతో క‌లిసి.. కాంగ్రెస్ ఇక్క‌డ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే.. కొన్నాళ్లుగా జార్ఖండ్‌లో స‌ర్కారును కూల‌దోసేందు కు బీజేపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గ‌రు భారీ ఎత్తున సొమ్ముతో .. ప‌శ్చిమ బెంగాల్ లో పోలీసుల‌కు చిక్క‌డం సంచ‌ల‌నంగా మారింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ శాసనసభ్యుడు కుమార్ జైమంగళ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు కూడా చేశారు. జార్ఖండ్ సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

`'ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల చొప్పున బీజేపీ ఇవ్వజూపింది. నగదుతో పట్టుబడ్డ ఎమ్మెల్యేలు.. పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలకు డబ్బును ఎరగా వేశారు. మంత్రి పదవులు, రూ.10 కోట్లు ఇస్తామని బేరమాడారు.

ఇర్ఫాన్‌, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగారి నాకు డబ్బు ఇస్తానని చెప్పి కోల్కతాకు రమ్మన్నారు. అక్కడి నుంచి గువాహటికి వెళ్దామని చెప్పారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో మీటింగ్ ఉందన్నారు' అని జైమంగళ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన ఎమ్మెల్యేలు.. మాత్రం భిన్న‌మైన వాద‌న వినిపించారు.  'నగదు తరలిస్తున్న వాహనంలో ముగ్గురు ప్రజాప్రతినిధులతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నగదు మొత్తం రూ.49 లక్షలు ఉంది.

ఈ డబ్బు ఎక్కడిది? ఎందుకు తీసుకొచ్చారనే విషయం వారు స్పష్టంగా చెప్పలేదు. కారు కొనేందుకని, ఆదివాసీలకు పంచేందుకు చీరలు కొంటామని చెప్పారు. ఈ సమాధానాలు సహేతుకంగా అనిపించలేదు. అందుకే వారిని అరెస్టు చేశాం' అని సీనియర్ పోలీసు ఒక‌రు చెప్పారు.
Tags:    

Similar News