జిన్ పింగ్ బాల్యం.. కష్టాలు.. కుటుంబ చరిత్ర తెలిస్తే.. అవాక్కే

Update: 2023-03-11 08:00 GMT
చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు షి జిన్ పింగ్. ఆరు నెలల కిందట ఆయన పని అయిపోయింది అనుకున్నారు. జిన్ పింగ్ ను నిర్బంధంలోకి తీసుకున్నారని, ఆయన పాలనలో జరిగిన నేరాలకు ఫలితం అనుభవించక తప్పదని చెప్పుకొచ్చారు. ఆ ఉక్కు సంకెళ్ల చైనాలో అసలేం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి కూడా ఎదురైంది. ఎవరేం చెప్పినా వెనకడుగు వేయని డ్రాగన్ కంట్రీలో ఏమైనా జరగొచ్చనే ఆందోనళ కూడా వెంటాడింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు భారత్ కూడా చెప్పింది. అయితే, జిన్ పింగ్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదని ఆయన ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టమైంది. వాస్తవానికి చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ)లో అంచలంచెలుగా ఎదిగారు జిన్ పింగ్. ఆయన పార్టీకి ఎంతటి క్రమశిక్షణతో పనిచేశారో చెప్పేందుకు ఓ ఉదాహరణ ఉంది. సీసీపీలో జిన్ పింగ్ తండ్రి కీలక స్థానంలో పనిచేశారు.

అయితే, కొన్ని కారణాల రీత్యా జైలు పాలైనప్పటికీ పార్టీపట్ల జిన్ పింగ్ నిబద్ధతలో అణువంతైనా తేడా రాలేదు.  కాగా 2012లో చైనా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు జిన్ పింగ్. ఆ తర్వాత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. వరుసగా మూడో సారి కూడా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. మరో ఐదేళ్లు దేశాధ్యక్షుడి బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఓ ప్రముఖ గాయకురాలి భర్తగా బాహ్యప్రపంచానికి పరిచయమైన జిన్‌పింగ్‌.. శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు.

ఒకప్పుడు పార్టీ సభ్యత్వానికే చుక్కెదురైంది. అలాంటాయన చైనాను సుదీర్ఘ కాలం పాలించే స్థితికి చేరుకున్నారు. జిన్‌ పింగ్‌ 1953లో బీజింగ్‌లో జన్మించారు. తండ్రి షి ఝేంగ్‌ షన్‌. సీసీపీలో కీలక స్థానంలో పనిచేశారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా అప్పటి అధ్యక్షుడు మావో తీసుకున్న నిర్ణయాలతో 1968లో ఝోంగ్‌ షన్‌ పదవీచ్యుతుడు అయ్యారు. వాస్తవానికి దీని వెనుక కథ వేరే ఉంది. తిరుగుబాటుకు కారణమవుతారని ఊహించి ఝోంగ్ వంటి నేతలందర్నీ మావో జైల్లో పెట్టించారు. అప్పటికి పార్టీలో వైస్‌ ప్రీమియర్‌ స్థానంలో ఉన్నారు ఝెంగ్‌షన్‌. ఆయనను మావో జైలుకు పంపారు. దీంతో జిన్‌ పింగ్‌ కుటుంబం కష్టాలపాలైంది. ఎన్నో అవమానాలు భరించారు. స్నేహితులు కూడా జిన్‌ పింగ్‌ను దూరం పెట్టడంతో వేదనకు గురయ్యారు.

అప్పటికి జిన్‌పింగ్‌ వయసు 15 ఏళ్లు. చైనాలో 1960ల్లో సాంస్కృతిక విప్లవం పేరుతో (రీ-ఎడ్యుకేషన్‌) ప్రముఖుల పిల్లలను నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు పంపించారు. ఇలా వేల మంది వెళ్లిపోయారు. జిన్‌పింగ్‌ కూడా కుటుంబంతో కలిసి షాన్‌షీ ప్రావిన్సులోని కొండప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామం లియాంగ్‌జియాహెకు వెళ్లారు. అక్కడ ఓ గుహలో ఇల్లు మాదిరిగా ఉన్న ప్రాంతంలోనే ఏడేళ్లు నివసించారు. గ్రామీణ ప్రజలు, పేదలతో కలిసి పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయం తన జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని జిన్‌పింగ్‌ పలుసార్లు చెప్పారు. ప్రస్తుతం ఆ గ్రామం పర్యాటక ప్రదేశంగా మారడం విశేషం.

కష్టాలు తీరాయి..

జిన్ పింగ్ తండ్రి జైలు నుంచి విడుదలయ్యాక వారి కుటంబ కష్టాలు తీరాయి. 1970ల్లో మావో మరణం తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు ఝేంగ్‌ షన్‌. అనంతరం పార్టీలో జిన్‌పింగ్‌కు సముచిత స్థానం కల్పించేలా చూశారు. కాగా, జిన్‌ పింగ్‌ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. గాయనిగా పేరొందిన పెంగ్‌ లియువాన్‌ను 1987లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో జిన్‌పింగ్‌ కంటే ఆయన భార్యకే సెలెబ్రిటీగా ఎక్కువ పేరుంది. కుటుంబం సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. సీసీపీ పట్ల జిన్‌ పింగ్‌ నిబద్ధత కొనసాగించారు. పార్టీలో సభ్యత్వం కోసం ప్రయత్నించినప్పటికీ కుటుంబ నేపథ్యం (తండ్రి జైలుకు వెళ్లడం) కారణంగా పలుసార్లు తిరస్కరణకు గురయ్యింది. 1974లో ఓ గ్రామానికి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1999లో ఫుజియన్‌ ప్రావిన్సు గవర్నర్‌గా, 2002లో జెజియాంగ్‌ ప్రావిన్సు చీఫ్‌గా, 2007లో షాంఘై బాధ్యతల్లో కొనసాగారు. చివరకు పార్టీ నిర్ణయాల్లో కీలకమైన పొలిట్‌బ్యూరోలో 2007లో నియమితులయ్యారు. 2012లో హు జింటావో స్థానంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా రెండు పర్యాయాల్లో ఎంతో శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్‌పింగ్‌.. జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News