ఇన్ని మరణాల తర్వాత బైడెన్ తో మాట్లాడటమా మోడీ?

Update: 2021-04-27 03:31 GMT
పాదరసం కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవటం.. దేశంలో ఏ మూల ఏ ఉపద్రవం వచ్చి పడినా.. నిమిషాల వ్యవధిలో ట్వీట్ చేయటం.. గంటల వ్యవధిలోనే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్ చేయటం.. కేంద్రం మీకు అండగా ఉంటుందన్న మాట చెప్పటం లాంటివి గడిచిన ఏడేళ్లలో మోడీ హయాంలో చూసే ఉన్నాం. మరి.. దేశంలో ఎక్కడేం జరిగినా వాయు వేగంతో స్పందించే ఆయనకు తాజాగా ఏమైంది?

కరోనా ఏమైనా కొత్త అనుకుంటే సర్లే అనుకోవచ్చు. అసలు కరోనా మీద అవగాహన లేని వేళలో అందరికంటే మిన్నగా స్పందించి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన వైనం మోడీ ఇమేజ్ ను భారీగా పెంచేసింది. దేశానికి సరికొత్త రక్షకుడు దొరికినట్లుగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అలాంటి వ్యక్తి నాయకత్వంలో దేశం ఉన్నప్పుడు.. రెండో వేవ్ అంత విస్తరించే వరకు ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రశ్న. సెకండ్ వేవ్ పుణ్యమా అని సీరియస్ కండిషన్లు చోటు చేసుకుంటాయనుకుంటే.. పరిష్కార మార్గాల్ని వెతికితే సరిపోతుంది.

తాజాగా దేశంలోనెలకొన్న పరిస్థితులు గడిచిన రెండు వారాలుగా ఉన్నాయి. అలాంటప్పుడు మొదటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడి.. భారత్ కు అవసరమైన సహాయ సహకారాల్నికోరితే..ఇప్పటికి అవి ఆచరణ రూపంలో ఉండేవి. అందుకు భిన్నంగా పలు రాష్ట్రాల్లో వేలాది మంది మరణించిన తర్వాత.. ఇప్పుడు మేల్కొన్న మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో ఫోన్లో మాట్లాడారు.

దీనికి సంబంధించిన వివరాల్ని మోడీనే ట్వీట్ రూపంలో వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత్ కు సాయం చేసేందుకు బైడెన్ ముందుకు వచ్చారని.. అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. బైడెన్ తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని.. వ్యాక్సిన్ ముడి పదార్థాల సమర్థవంతమైన సరఫరా ప్రాముఖ్యత ఇచ్చేందుకు అగ్రరాజ్యం ఓకే చెప్పింది. కరోనా వేళ అవసరమైన వెంటిలేటర్లు.. కిట్లతో పాటు భారత్ కు అవసరమైన సామాగ్రిని పంపేందుకు అమెరికా ఓకే చెప్పినట్లుగా మోడీ సర్కారు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ఇదే నిర్ణయం రెండు వారాల ముందు తీసుకొని ఉంటే.. ఇన్ని చావులు చోటు చేసుకునేవా? ఇన్ని కేసులు నమోదయ్యేవా? దేశం వల్లకాడు మాదిరి మారి.. తీవ్రమైన విషాదంలో కూరుకుపోయేవా? అన్నవి ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంది?
Tags:    

Similar News