జో బైడెన్ సంబరం.. అధ్యక్షులు ఎవరైనా అగ్రరాజ్యం తీరు ఇదేనా?

Update: 2021-04-22 10:30 GMT
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికాను నిందించే వారిని ద్రోహులుగా.. దుర్మార్గులుగా అభివర్ణించేవారు చాలామందే కనిపిస్తారు. విశాలమైన మనసు ఉండటమే తప్పన్నట్లుగా కొందరు మాట్లాడతారు. దానికి ప్రాక్టికల్ అన్న అందమైన ముసుగు వేస్తారు.  ఎందుకిందంతా అంటే.. అగ్రరాజ్యమైన అమెరికా ప్రధమ ప్రాధాన్యం తాను.. తన దేశం తప్పించి మరింకేమీ ఉండదు. ఎవరిని ఏమీ అడగదు. తనకు కావాల్సింది తన దగ్గర లేకుంటే.. ఎవడి దగ్గర ఉందో దాన్ని చూసి.. లాగేసుకుంటుందే తప్పించి.. కాస్త మాకు కావాలని అడగటం దానికి చేతకాదు.

మరీ.. ఎక్కువ చేసి చెబుతున్నారన్న భావన కొందరికి కలగొచ్చు. అలాంటి వారు.. రెమెడెసీవర్ ఎపిసోడ్ లోనూ.. మరికొన్ని అత్యవసర ఔషధాల విషయంలో మొదటి వేవ్ బలంగా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ను ఎంత ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారో తెలిసిందే. ప్రధాని హోదాలో ఉన్న మోడీ మిగిలిన మర్యాదల్ని పక్కన పెట్టేసి.. తన గెలుపు కోసం అమెరికాకు వచ్చి మరీ ఓపెన్ గా ప్రచారం చేసినప్పటికి.. తన దేశ అవసరాల కోసం అలాంటి మిత్రుడ్ని సైతం ఓపెన్ గా బెదిరించే సత్తా అగ్రరాజ్యాధినేత సొంతమని చెప్పాలి.

తమ దేశ ప్రయోజనాల కోసం.. తమ దేశ ప్రజల కోసం అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వారెంతలా వ్యవహరిస్తారన్న దానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటివెన్నో జరుగుతుంటాయి. ఇరాక్ లోని ఆయిల్ నిక్షేపాల కోసం ఆ దేశాన్ని ఎంతలా హింసించింది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తాజాగా జో బైడన్ తెగ సంతోషంతో ఉన్నారు. కరోనా టీకాల పంపిణీ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం అనుకున్న గడువు కన్నా ముందే సాధించిందని ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు.

దేశంలో 200 మిలియన్ల టీకా డోసుల పంపిణీ పూర్తి అయిన సందర్భంగా తమ ప్రభుత్వ పని తీరును ఆయన మెచ్చుకున్నారు. తాము సాధించిన విజయం అసాధారణమైనదని.. వ్యాక్సినేషన్ లో మనం సాధించిన పురోగతి అద్వితీయమైనదిగా ఆయన పేర్కొన్నారు. నిజమే.. 200 మిలియన్ల డోసులు పంపిణీ చేయటం నిజంగానే రికార్డు. అయితే.. అదెన్ని దేశాల ప్రయోజనాల్ని.. సంక్షేమాన్ని.. ప్రాణాల్ని పణంగా పెట్టిందన్నది ప్రశ్న.  

వాస్తవానికి కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో అమెరికానే ముందు ఉంది. అయితే.. కీలకమైన వ్యాక్సిన్ ముడిసరుకుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయటానికి ఏ మాత్రం సిద్ధంగా లేని అమెరికా.. ఎప్పడూ తన ప్రయోజనాలే తను ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది. మిగిలిన వారు ఏమై పోయినా ఫర్లేదన్నట్లు ఉంటుంది. అందుకే అనేది.. ఇవాల్టి ఈ సంబరం వెనుక.. ఎన్ని దేశాల ఆర్తనాదాలు ఉన్నాయన్నది అసలు ప్రశ్న.
Tags:    

Similar News