వర్మ చేతిలో చంద్రబాబు బండారం

Update: 2017-07-09 07:02 GMT
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రానున్న సినిమాలపై అంతటా ఆసక్తి ఏర్పడింది. ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితాల్లో ఉన్న కొన్ని సంఘటనలతో ప్రస్తుత సీఎం చంద్రబాబుకు సంబంధాలు ఉండడంతో వాటిని ఎంతవరకు ఈ సినిమాల్లో ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎన్టీఆర్ తనయుడు, హీరో బాలయ్య ఈ జీవిత చరిత్ర సినిమాలో నటిస్తున్నారు. అయితే... అది చంద్రబాబు - బాలయ్య ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి వారికి అనుకూలంగానే ఆ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ... రీసెంటుగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ పై సినిమా తీస్తానని ప్రకటించడంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది. అసలే వర్మ... అందులో ఏం చూపిస్తాడో అని తెగ టెన్షన్ పడుతున్నారట. వారి టెన్షన్ కు తగ్గట్టుగానే వైసీపీ నేత జోగి రమేశ్ మరో బాంబు పేల్చారు.
    
రామ్ గోపాల్ వర్మ రూపొందించబోయే సినిమాలో చంద్రబాబే విలన్‌ అని జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌ పై చెప్పులు - రాళ్లు వేయించి - అవమానించి ఆయన మరణానికి కారణమైంది చంద్రబాబే అన్నారు. ఇవన్నీ ఆ సినిమాలో చూపించాలని, ప్రజలకు నిజాలు తెలియజేయాలన్నారు.
    
ఎన్టీఆర్ ను ఎలా అవమానించారు.. ఎలా వెన్నుపోటు పొడిచారు వంటివన్నీ వర్మ సినిమాలో ఉంటాయని రమేశ్ అన్నారు. కాగా... ఈ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉందంటూ టీడీపీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబును దెబ్బకొట్టేందుకు వర్మతో వైసీపీ ఈ సినిమా తీయిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే... వర్మ ఒకరి మాట వినే రకమా అన్నది కూడా ఆలోచించాలి. తన బుర్రలో ఏమనిపిస్తే అది మాత్రమే చేసే వర్మ ఇలా ఎవరి కోసమో ఇంకెవరికో నెగటివ్ గా తీయరన్న వాదనా వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా వర్మ ఈ సినిమా తీస్తే మాత్రం చంద్రబాబు బండారం ఈతరానికి తెలిసిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News