ఒక ఎమ్మెల్యే ఫారిన్ వెళితే..మరొకరు గన్ మెన్లను విడిచి వెళ్లారు

Update: 2019-09-10 05:02 GMT
ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదిన నెలల తర్వాత పదవుల పంపకం చేపట్టటంతోపాటు.. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ కు పార్టీ నేతల నుంచి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావటం ఇదే తొలిసారంటున్నారు. మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలకు పదవులు దక్కకపోవటంతో వారు ఆగ్రహంతో ఉన్నారు.

పదవి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కనీసం పిలిచి మాట్లాడితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సమీకరణాలు కుదర్లేదనో.. లేదంటే మరో పదవిని ఇస్తానన్న హామీని ఇస్తే బాగుంటుందని.. అదేమీ లేకుండా తన మానాన తాను ఉండిపోవటం.. ఎమ్మెల్యేలతో కనీసం దగ్గరకు రానివ్వకపోవటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధినేత మీద పీకల వరకూ గుర్రు ఉన్నా.. బయటపడేందుకు నేతలు ఎవరూ ఇష్టపడటం లేదు. దీనికి భిన్నంగా కొందరు నేతలు మాత్రం తమ కడుపులోనిదంతా బయటకు కక్కేస్తుంటే.. ఇంకొందరు మాత్రం కామ్ గా తాము చేయాల్సిన పని తాము చేస్తున్నారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విషయానికే వస్తే.. ఆయన ఆదివారం విదేశాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. తనను గుర్తించటం లేదన్న గుర్రుగా ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న అలకతో అసెంబ్లీ సమావేశాల వేళ.. తన దారిన తాను ఫారిన్ వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది.

బడ్జెట్ సమావేశాలు పెట్టుకొని.. వాటిని పట్టించుకోకుండా ఫారిన్ ట్రిప్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో స్థానం ఆశించిన జోగు రామన్న.. ఆదివారం ఉదయం నుంచి ఎక్కడకు వెళ్లారో సమాచారం రావటం లేదు. ఫోన్ స్విఛాప్ చేసుకొని.. గన్ మెన్లను కూడా వదిలి పెట్టి వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రివర్గ విస్తరణలో తనకు బెర్త్ ఖాయమని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో.. పరిస్థితి మరోలా ఉండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.

పదవులు రాక నాయిని తదితరులు తమ అక్కసును వ్యాఖ్యల రూపంలో ఇప్పటికే బయటపెట్టటం తెలిసిందే. మరి.. గులాబీ నేతల గుర్రును కేసీఆర్ ఎలా తగ్గిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News