ఆయన తీర్పిస్తే..పవర్ ఫుల్ సీఎంలూ జైలుకే

Update: 2017-02-16 07:05 GMT
జాన్ మైఖేల్ కున్హా. ఈ పేరును చాలా తక్కువ మంది విని ఉంటారు. తమిళనాడునే కాదు దేశం మొత్తం దృష్టిని తన మీద పడేలా చేసిన తమిళనాడు రాజకీయాలకూ.. ఈ పేరుకు బలమైన సంబంధం ఉందనే చెప్పాలి. అమ్మ నెచ్చెలి చిన్నమ్మ సీఎం కలను శాశ్వితంగా(?) సమాధి చేయటమే కాదు.. ‘అమ్మ’ బ్రాండ్ కు  ఫ్యూచర్ అనేది లేకుండా  పోవటానికి ఆయన తీర్పు ఒక కారణంగా చెప్పాలి. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనేం చేశారన్నది చూస్తే..

ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న జాన్ మైఖేల్ కున్హా.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన బెంచ్ మీదకు కేసు వెళితే.. వ్యక్తులు ఎంతటి శక్తివంతులైనా ఆయన అస్సలు పట్టించుకోరు. న్యాయం.. ధర్మం ఏమిటి? వాటిని దెబ్బ తీసే ప్రయత్నం ఏం జరిగింది?ఆరోపణలు ఎంతవరకు నిజం? లాంటివి మాత్రమే చూస్తారు. అందుకే..ఆయన బెంచ్ మీదకు ఏదైనా కేసు వెళితే.. ప్రముఖులు సైతం జడుచుకుంటారు.

అక్రమాస్తుల కేసులో జయలలిత.. శశికళతో పాటు మరో ఇద్దరిపైనా ఆరోపణలు చేస్తూ చేసిన ఫిర్యాదును సుదీర్ఘంగా విచారించి 2014 సెప్టెంబరు 27న సంచలన తీర్పునిచ్చారు. అమ్మకు పదేళ్లు జైలుశిక్ష.. వందకోట్ల జరిమానా.. ఆమె నెచ్చెలి శశికళకు నాలుగేళ్లు జైలుశిక్ష.. పది కోట్ల జరిమానాను విధించారు. మరో ఇద్దరికి కూడా జైలుశిక్ష.. జరిమానాను విధించారు. ఆయన తీర్పుతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత తన పదవికి రాజీనామా చేసి..తన విధేయుడైన పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించి జైలుకు వెళ్లారు.

అనంతరం ఆ కేసును సుప్రీంకు అప్పీల్ కు వెళ్లి.. బెయిల్ మీద బయటకు వచ్చారు. జయలలిత బయటకు వచ్చాక శశికళ.. మిగిలినవారు బయటకు వచ్చారు. ఆ కేసుపైనే విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా తన తీర్పును వెలువరించటంతో సీఎం కావాలని కలలు కన్న శశికళకు అవి కాస్తా కల్లలు అయ్యాయి. అంతేనా.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాల్సిన ఆమె.. పరప్పన అగ్రహార జైలులో తన బంధువు ఇళవరసితో కలిసి జైలు గదిని పంచుకోవాల్సివచ్చింది.

కున్హా నిక్కచ్చితీర్పులతో జయలలిత మాత్రమే కాదు.. మరో పవర్ ఫుల్ లేడీ సీఎం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. 2004లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమాభారతి వ్యవహరించే వారు. అప్పట్లో ఆమెను శక్తివంతమైన మహిళా ముఖ్యమంత్రిగా వ్యవహరించే వారు. 1994లో ఈద్గా మైదానంలో ఆంక్షలున్నప్పటికి లెక్క చేయకుండా జెండా ఎగురవేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెకు బెయిల్ ఇవ్వటానికి ఆయన నో చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక.. న్యాయపరమైన చిక్కులు రావొచ్చన్న న్యాయవర్గాల సలహాతో హుబ్లీ జిల్లా జడ్జిగా ఉన్న కున్హా ముందు హాజరయ్యారు. తన మీద ఉన్న అభియోగాల్నికొట్టి వేయాలని ఆమెకోరారు. కానీ.. ఆమె వినతిని ఆయన ఒప్పుకోలేదు. ఈ కేసు విషయంలో కున్హా తీసుకున్న నిర్ణయంతో ఆమె జైలుకు వెళ్లకతప్పలేదు. తాను విచారించే కేసుల్లో వ్యక్తులు ఎవరన్నది పట్టించుకోకుండా.. విషయాన్ని మాత్రమే తీసుకునే కున్హా బెంచ్ కు కేసులు వెళితే చాలు.. తప్పు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అది సామాన్యుడికైనా.. సీఎంకైనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News