విల‌న్ ఓడాడు!..హ‌స్తం పార్టీ చెడ్డ‌దైపోయింద‌ట‌!

Update: 2019-05-03 16:40 GMT
గెలిచే పార్టీలు - గెలిపించే పార్టీలు అంటేనే నేత‌లకు ఇష్టం. త‌మ భ‌విష్య‌త్తు బాగుంటడాలంటే రాజ‌కీయ నేత‌ల‌కు ఈ రెండూ అవ‌స‌ర‌మే క‌దా. మ‌రి ఓడిపోయే పార్టీలు - ఓట‌మిని ఇచ్చే పార్టీలు అంటే... ఏ ఒక్క‌రికి కూడా అంత‌గా రుచించ‌వు క‌దా. ఈ మాట అక్ష‌రాల నిజ‌మేన‌ని ఓ విల‌న్ తేల్చేశాడు. త‌న‌ను అక్కున చేర్చుకుని, రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చి, టికెట్ ఇచ్చీ బ‌రిలో నిలిపితే... ఓటమే ద‌క్క‌డంతో ఆ విల‌న్... త‌న‌కు అన్నీ ఇచ్చిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ను చెడ్డ పార్టీగా తీర్మానించేశాడు. ఆ విల‌నెవ‌రు? ఆ క‌థేంటీ? అన్న వివ‌రాల్లోకి వెళితే... టాలీవుడ్ మూవీ రేసుగుర్రం గుర్తుంది క‌దా. అల్లు అర్జున్ తో స‌రిసమానంగా మార్కులేయించుకున్న విల‌న్ పాత్ర‌లో క‌నిపించిన ప్ర‌ముఖ న‌టుడు ర‌వి కిష‌న్ కూడా గుర్తున్నాడు క‌దా.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌వికిష‌న్ నాడు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచి న‌టుడిగానే ముద్ర వేయించుకున్న ర‌వికిష‌న్ కు కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తింపే ఇచ్చింది. ర‌వికిషన్ కు ఆయ‌న సొంత నియోజవ‌ర్గం జైన్ పూర్ టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాదిరే ర‌వికిష‌న్ కూడా ఓట‌మిపాల‌య్యారు. దీంతో షాక్ కు గురైన ర‌వికిష‌న్‌.. కొంత‌కాలం పాటు రాజ‌కీయాల‌కు దూరంగానే ఉన్నారు. తాజాగా 2017లో కాంగ్రెస్ కు క‌టీఫ్ చెప్పేసి బీజేపీతో చేరిపోయారు. క‌మ‌ల‌నాథులు కూడా ర‌వికిష‌న్ ను బాగానే చూసుకుంటున్నారు. పార్టీలోకి వ‌చ్చిన ర‌వికిష‌న్ కు గోర‌ఖ్ పూర్ టికెట్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తాను తప్పుచేశానని ఆయ‌న కామెంట్ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆ పార్టీ అధిష్ఠానం తనను కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పనితీరు నచ్చే బీజేపీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. సినిమాల్లో  నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయం సాధించిన ఎన్టీఆర్‌, వినోద్ ఖన్నా వంటి ప్రముఖులే తనకు ఆదర్శమని రవికిషన్ తెలిపారు. మొత్తంగా త‌న‌కు రాజకీయ ఓన‌మాలు దిద్దించిన కాంగ్రెస్ పార్టీపై ర‌వికిష‌న్ చేసిన కామెంట్లు ఇప్పుడు నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారాయి.


Tags:    

Similar News