మహిళా కానిస్టేబుల్ పై మీడియా దుశ్యర్చ..ముగ్గురిపై నిర్భయ కేసు

Update: 2020-01-22 13:59 GMT
మీడియా హద్దుతు మీరుతోంది. సమాజంలో జరిగే దురాగతాలు - దుశ్చర్యలను వెలుగులోకి తీసుకుని రావడంతో పాటు నిందితులకు శిక్షలు పడేలా వ్యవహరించాల్సిన గురుతర బాధ్యతను వదిలి... తామే కీచకులుగా మారిపోయిన వైనం ఇప్పుడు పెను కలకలమే రేపుతోంది. అది కూడా నిత్యం నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిపోతున్న అమరావతిలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. విధులను ముగించుకుని దుస్తులు మార్చుకుంటున్న  ఓ మహిళా కానిస్టేబుల్ ను రహస్యంగా తమ ఫొటోలు - వీడియోలు తీసిన ఈ ఘటన ఇప్పుడు నిజంగానే పెను కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితులుగా భావిస్తున్న మూడు న్యూస్ ఛానెళ్లకు చెందిన కెమెరామెన్లపై ఏకంగా నిర్భయ కేసులు నమోదైపోయాయి. మహిళా పోలీసులనే కాకుండా యావత్తు మహిళా లోకాన్ని - పోలీసు శాఖను - సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటన అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘన వివరాల్లోకి వెళితే... ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల నిమిత్తం మందడం వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ డ్యూటీ అనంతరం గ్రామంలోని హైస్కూల్‌ లో వారికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ దుస్తులు మార్చకుంటుండగా కొన్ని చానళ్ల సిబ్బంది గది కిటికీల నుంచి రహస్యంగా వీడియో రికార్డు చేశారట. అయితే వీడియో కెమెరాలు తనను వీడియో తీస్తున్న విషయాన్ని గుర్తించిన సదరు మహిళా కానిస్టేబుల్‌ అప్రమత్తమయ్యారు. వెనువెంటనే ఆమె మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడిన మీడియా ప్రతినిధులు అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ప్రాథమిక వివరాల సేకరణ అనంతరం ముగ్గురు కెమెరామెన్లపై ఏకంగా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్బంగా తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రత కోసం వచ్చిన మహిళా పోలీసులకు మండడం జడ్పీ హైస్కూలులో వసతి కల్పించామని,  ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుంటూ... కొన్ని మీడియా సంస్థలకు చెందిన కెమెరామెన్లు ఫొటోలు, వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు ముగ్గురు కెమెరామెన్లపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

ఈ వ్యవహారంపై సీఐడీ అదనపు ఎస్పీ సరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రజాస్వామ్యంలో నాలుగో ఎస్టేట్ అని, అలాంటి మీడియాకు చెందిన వ్యక్తులు ఇలా మహిళా పోలీసులు దుస్తులు మార్చుకుంటుంటే ఫొటోలు, వీడియోలు తీస్తారా? అన్ని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల నుంచి ఈ తరహా ఘటనలను ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు చైతన్యం కల్పించాల్సిన మీడియానే ఇలా చేస్తే ఎలాగని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులపై ఈ రీతిన వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ నుంచి అసెంబ్లీ భద్రతా విధులకు వచ్చిన మహిళా డీఎస్పీ ప్రేమ్ కాజల్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళా పోలీసులు ఉన్న గదిలోకి వచ్చి ఫొటోలు -వీడియోలు తీస్తారా? అంటూ మండిపడ్డారు. మహిళా పోలీసులు ఉంటున్న గదిలోకి రావడమే తప్పైతే... మహిళా పోలీసులను కించపరిచేలా మాట్లాడిన మీడియా ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళా కానిస్టేబుల్ కు అండగా నిలవాల్సిన కొందరు ఆమెనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఈ తరహా చర్యలను సహించబోమని హెచ్చరించారు.


Similar News