తెలంగాణలో బోణి కొట్టిన జ‌న‌సేన‌!

Update: 2019-06-07 07:35 GMT
సిద్ధాంతాలు వ‌ల్లించ‌టం వేరు. వాటిని అమ‌లు చేయ‌టం వేరు. మిగిలిన రంగాల సంగ‌తి ఎలా ఉన్నా.. రాజ‌కీయాల్లో చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు ఏ మాత్రం పొంత‌న ఉండ‌దు. కానీ.. అందుకు భిన్నంగా చెప్పిన‌ట్లే చేయ‌ట‌మే కాదు.. దానికి అనుగుణంగా ఫ‌లితాన్ని సాధించ‌టం మామూలు విష‌యం కాదు. తాజాగా అలాంటి ఫ‌లితాన్నే సాధించింది జ‌న‌సేన పార్టీ.

ఏపీలో దారుణ ప‌రాజ‌యంతో పాటు.. పార్టీ చీఫ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వేళ‌లో.. నిరాశ‌.. నిస్పృహ‌లో కూరుకుపోయిన పార్టీకి.. చీక‌ట్లో చిరుదివ్వెలా ఒక చిన్న విజ‌యం వారిలో కొత్త హుషారును ఇస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా వెల్ల‌డైన స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థి ఒక‌రు విజ‌యం సాధించిన విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు భిన్నంగా మ‌ద్యం.. ఓట్ల‌కు డ‌బ్బులు పంచ‌టం లాంటివి ఏమీ చేయ‌కుండా.. తాను చెప్పే సిద్ధాంతాల‌కు అనుగుణంగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి విజ‌యంసాధించ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

జ‌న‌గాం జిల్లాలోని ఘ‌న‌పూర్ మండ‌లం ప‌రిధిలోని జూల‌ప‌ల్లి ఎంపీటీసీ స్థానాన్ని జ‌న‌సేన అభ్య‌ర్థి పృధ్వీ  చేజిక్కించుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న 400 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్‌.. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌తో పోటీ ప‌డిన ఆయ‌న భారీ మెజార్టీతో గెల‌వ‌టం విశేషం. పృథ్వీకి 1457 ఓట్లు రాగా.. టీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్య‌ర్థులు వెయ్యి ఓట్లు తెచ్చుకోవ‌టంలోనే ఫెయిల్ కావ‌టం విశేషం. తాజా విజ‌యంతో తెలంగాణ‌లో జ‌న‌సేన బోణి కొట్టింద‌ని చెప్పాలి. జ‌న‌సైనికుడు సాధించిన విజ‌యంపై ప‌వ‌న్ స్పందించాల్సి ఉంది.


Tags:    

Similar News