న్యాయం కావాలని జడ్జిలు రోడ్డు మీదకొచ్చారు

Update: 2016-06-27 05:21 GMT
అనూహ్య పరిణామంగా దీన్ని చెప్పొచ్చు. నిత్యం న్యాయం చెప్పే జడ్జిలు.. తమకు న్యాయం కావాలంటూ ఆదివారం హైదరాబాద్ రోడ్ల మీదకు పెద్ద ఎత్తున కదలి రావటం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల్ని విభజిస్తూ ఉమ్మడి హైకోర్టు విడుదల చేసిన ప్రాథమిక కేటాయింపుల జాబితాపై వెల్లువెత్తుతున్న నిరసన ఆదివారంతో మరో మలుపు తీసుకుంది.

గన్ పార్క్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జడ్జిలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 120 మంది జడ్జిలు సామూహిక రాజీనామా లేఖను రాస్తూ.. తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డికి సమర్పించారు. ఏడు రోజుల్లో తమ సమస్యలు పరిష్కారం కాకుంటే తమ రాజీనామాల్ని ఆమోదించాలంటూ వారు డిమాండ్ చేయటమే కాదు.. తమ వాదనను గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు.

తమకున్న సమస్యల పరిష్కారం కోసం జడ్జిలు రోడ్డు బాట పట్టటం దేశంలో ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. తమకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్ కు వివరించేందుకు జడ్జిల బృందం ఆయన్నుకలిసింది. ఈ సందర్భంగా తమ సమస్యను వివరించారు. కేటాయింపుల విషయంలో తమకు దారుణమైన అన్యాయం జరిగినట్లుగా వారు ఆరోపించారు. మూడు వారాలుగా ఆందోళన చేస్తుంటే ఈ సమస్యను పరిష్కరించాల్సిన హైకోర్టు.. సంఘం నాయకుల్ని భయపెడుతుందన్నారు. బంగారు తెలంగాణ కోసం జడ్జిల పోస్టులను వదులుకోవాలని నిర్ణయించినట్లు చెప్పిన వారు.. తమ రాజీనామాలు కనువిప్పు కలిగిస్తాయన్నారు. హైకోర్టు ప్రాంగణంలో నిరాహార దీక్షలు చేపట్టి ప్రాణాలు వదిలేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బోసలే ఆదివారం రాత్రి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. సంచలనం రేకెత్తిస్తున్న ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
Tags:    

Similar News