గడ్కరీ లెవల్లోనే జైట్లీ కూడా ఏసుకున్నాడే

Update: 2016-05-12 09:56 GMT
ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో కీలకమైన శాసన.. న్యాయవ్యవస్థల మధ్య కొత్త లొల్లి షురూ కానుందా? దానికి ఎన్డీయే నేతల మాటలు కారణం కానున్నాయా? అంటే అవునన్నట్లుగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి నిన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. న్యాయమూర్తుల మీద సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ లకు మహారాష్ట్రలో అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆ తీర్పు మీద ఫైర్ అయిన గడ్కరీ.. న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసే శాసనకర్తలుగా మారాలంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. గడ్కరీ మాటల మీద రచ్చ ఒక కొలిక్కి రాక ముందే.. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

ప్రభుత్వాన్ని.. పాలనా వ్యవస్థనూ నెమ్మది నెమ్మదిగా న్యాయ వ్యవస్థ ఆక్రమిస్తుందంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దేశ భవిష్యత్తు పట్ల ప్రమాద ఘంటికలు మోగుతున్న సంకేతాల్ని సూచిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జైట్లీ.. ఇటుక మీద ఇటుక పేర్చుకున్న చందంగా భారత శాసన వ్యవస్థను న్యాయ వ్యవస్థ నాశనం చేస్తుందంటూ పెద్ద పెద్ద మాటల్నే అనేయటం గమనార్హం.

జీఎస్టీ బిల్లుపై మాట్లాడిన సందర్భంగా జైట్లీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. పన్నుల వసూలు అధికారం ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉండాలని.. అది న్యాయవ్యవస్థ చేతుల్లోకి వెళ్లకూడదన్న మాట చెప్పిన జైట్లీ.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పదని.. అది దుస్సాహసాల దిశగా సాగరాదన్నారు. ఇప్పటికే చాలా అంశాలు న్యాయ వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోయాయని.. పన్నులపై నిర్ణయాల విషయాన్ని కూడా న్యాయవ్యవస్థకే కట్టబెట్టాలా? అంటూ కాంగ్రెస్ మీద ఫైర్ అయిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా న్యాయ వ్యవస్థ మీద కేంద్రమంత్రులు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా రెండు వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వాతావరణం పెరిగే ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ మీద తమ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల్ని మోడీ గమనిస్తున్నారా..?
Tags:    

Similar News