న్యాయమూర్తుల అహంకారం తగ్గాలి: టీడీపీ

Update: 2018-01-05 07:48 GMT
ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ ఒకరు న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమయ్యాయి. సుప్రీం కోర్టు - హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సుప్రీం కోర్టు శాసన వ్యవస్థను శాసించేందుకు ప్రయత్నిస్తోందని పలువురు ఎంపీలు ఆరోపించగా రవీంద్రబాబు మరో అడుగు ముందుకేసి మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల అహంకారానికి అడ్డుకట్ట వేయాలని ఆయన అన్నారు.
    
సభలో రవీంద్రబాబు మాట్లాడుతూ... న్యాయవ్వవస్థ ప్రస్తుతం పార్లమెంట్ ముఖద్వారం వరకు వచ్చిందని.. త్వరలో అది పార్లమెంట్‌ లోకి వస్తుందని అన్నారు. న్యాయమూర్తులు హద్దులు, జవాబుదారీతనాన్ని నిర్ణయించాలని పార్లమెంట్‌ను కోరారు. సుప్రీం కోర్టు పనితీరును పారదర్శకం చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అప్పుడే న్యాయమూర్తుల అహంకారాన్ని అదుపు చేసేందుకు సాధ్యమవుతుందని రవీంద్రబాబు అన్నారు. అంతేకాకుండా... తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కూడా ఇదేనని ఆయన అనడంతో మిగతా టీడీపీ ఎంపీలంతా షాక్ తిన్నారు.
    
న్యాయమూర్తుల వ్యవహారం చూస్తుంటే వారి వేతనాలను వారే పెంచుకుంటూ తీర్పులు ఇచ్చినా ఆశ్చర్యం లేదని రవీంద్రబాబు అన్నారు.  పార్లమెంట్ కార్యక్రమాలను లైవ్‌ ప్రసారాలుగా ఇస్తునప్పుడు.. కోర్టు తీర్పులను ఎందుకు లైవ్‌లో ప్రసారం చేయకూడదని రవీంద్రబాబు ప్రశ్నించారు. చట్టాలు తయారు చేసేలా సుప్రీం ఒత్తిడి తెస్తోందని.. ఒకవేళ ఆ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కారం అంటున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు వ్యవహారాలపై బయట మాట్లాడేందుకు ఎంపీలైన తమకే భయంగా ఉందని.. ఏం మాట్లాడితే కోర్టు ఏం చేస్తుందోనన్న ఆందోళన ఉందన్నారు. పార్లమెంట్‌లో ఏం మాట్లాడినా కోర్టు ధిక్కారం కిందకు రాదన్న ధైర్యంతోనే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని వివరించారు. తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను తొలగించాలని రాజ్యాంగం చెబుతోందని.. కానీ ఇప్పటి వరకు ఒక్క న్యాయమూర్తినైనా అలా తొలగించగలిగామా అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేస్తే న్యాయమూర్తులను కూడా శిక్షించేలా చట్టం తేవాలన్నారు. తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులకు శిక్షలు పడాలా వద్దా మీరే చెప్పండి అంటూ లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైని ఆయన ప్రశ్నించారు.
    
కాగా గతంలోనూ జవాన్లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన రవీంద్రబాబు ఇప్పుడు న్యాయమూర్తులపైనా మిగతా ఎంపీల కంటే తీవ్రంగా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News