టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో ఈ ఆందోళ‌న?

Update: 2016-10-01 09:47 GMT
అధికార టీఆర్‌ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కొత్త‌ ఆందోళ‌న మొద‌లైంది. ప్రభుత్వంలో శాసనసభ్యులు డమ్మీలుగా మారిపోయార‌నే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల హవా కొనసాగేదని, కానీ ప్రస్తుత టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు చెప్పినప్ప‌టికీ అభివృద్ధి పనులు కూడా జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాసనసభ్యుల మాట అధికారులు పెడచెవిన పెడుతున్నారని, దాంతో నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే చిత్రంగా అధికార - ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలందరీ పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు.

సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ - కాంగ్రెస్‌ - వైసీపీ - బీఎస్పీల నుంచి విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు - అధికారపార్టీలో చేరిన విషయం తెలిసిందే. విపక్ష ఎమ్మెల్యేల చేరికతో అధికారపార్టీ తన బలాన్ని పెంచుకుంది. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా - ఇతర పార్టీల నుంచి అధికారపార్టీలో చేరిన వారికి కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండాపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొలినాళ్లలో తమపార్టీ ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన అధికార పార్టీ ఆ తరువాత ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వలసలు కొనసాగడంతో పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దయనీయంగా తయారయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గత రెండేళ్ల నుంచి పెద్దగా అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవన్నది నిర్వివాదాంశం. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపుల్లోను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శించిందని గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బాహాటంగానే ఆరోపించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

అయితే ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత లేదన్న వాదనలు సరికాదని అధికారపార్టీ నేతలంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తున్నామ‌ని వివ‌రిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తమ వ్యక్తిగత పనులు కావడం లేదన్న అసంతృప్తితో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఈరకమైన ప్రచారానికి తెరలేపి ఉంటారని అనునాలు వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వాల్లో మాదిరిగా ఎమ్మెల్యేలు ఆడింది ఆట - పాడింది పాట అన్నట్లుగా చెల్లుబాటు కావడం లేదన్నది నిర్వివాద అంశమేనని అధికారపార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. తమది ప్రజలకు జవాబుదారి ప్రభుత్వమని - ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన అభివృద్ధి పనులు జరగడం లేదని - ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదన్నది శుద్ధ అబద్ధమని పేర్కొంటున్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని స‌ర్దిచెపుతూ వ‌స్తున్నారు.
Tags:    

Similar News