తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు కీలకమైన డిమాండ్ ఒకటి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం విప్పుతున్న కేసీఆర్...ఏపీ కోసం కూడా అదే రీతిలో మాట్లాడాలనేది సదరు డిమాండ్. ఇటీవలి కాలంలో ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు - ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం వంటివి చేస్తున్న నేపథ్యంలో కొందరు చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారే ఈ డిమాండ్ తెరమీదకు తెచ్చారని అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదు. ఈ డిమాండ్ చేసింది టీడీపీ సీనియర్ నేత - ఆ పార్టీ తరఫున గళం విప్పే ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్.
తాజాగా మీడియాతో మాట్లాడిన జూపూడి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రపదేశ్ అభివృద్ధికి కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ పార్టీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఒక్క ఏపీనే బీజేపీ టార్గెట్ చేస్తోందని.. చంద్రబాబును నిందించడమే బీజేపీ-వైసీపీలు అజెండాగా పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా చూడటమే బీజేపీ లక్ష్యమా అంటూ ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటే.. ఒక తెలుగువాడిగా కేసీఆర్ పట్టించుకోరా అంటూ చిత్రమైన ప్రశ్న సంధించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లు కాదు కదా.. రెండు ఓట్లు కూడా రావని ప్రభాకర్ జోస్యం చెప్పారు. బీజేపీ దేశవ్యాప్తంగా దళితులపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వవలసిని అవసరం లేదని జూపూడి వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు తమతో కలిసుండి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం వెనుక కుట్ర కోణం ఉందని.. త్వరలోనే పవ్ కుట్రలు బయటపెడతామని జూపూడి తెలిపారు. నెల్లూరులో వైసీపీ నకిలీ దీక్ష చేస్తోందని.. అది పబ్లిసిటీ కోసం తప్పించి రాష్ట్రం కోసం కాదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికే నవనిర్మాణ దీక్షకు పిలుపునిచ్చినట్లు తమ పార్టీ చేసిన కార్యక్రమం గురించి జూపూడి సమర్థించుకున్నారు.