రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం చెప్పిన జడ్జి

Update: 2015-10-03 04:37 GMT
తెలంగాణ రాష్ట్ర అధికారపక్షాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన రైతుల ఆత్మహత్యల సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక కేసీఆర్ సర్కారు తల బాదుకుంటోంది. ఏం చేస్తే రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయన్న అంశంపై దృష్టి సారించినా సమాధానం దొరకని పరిస్థితి. భారీగా నిధులు వెచ్చించాలంటే చేతిలో ఆ స్థాయిలో నిధులు లేని స్థితిలో.. రైతుల ఆత్మహత్యలు ఆపలేక.. జరుగుతున్న వాటికి సమాధానం చెప్పలేక కిందామీదా పడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ఓ పరిష్కారం చెప్పుకొచ్చారు. ఆసక్తి రేకెత్తించేలా ఉన్న ఈ పరిష్కరం చూస్తే.. ఒక్కరోజు అధికారులు లంచాలు తీసుకోకుండా ఉంటే రైతుల అప్పులు తీర్చొచ్చని.. తద్వారా రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చని ఆయన చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజు లంచాలు తీసుకోవటం ఆపేస్తే.. ఆ డబ్బుతో రైతుల అప్పులు తీర్చేయొచ్చని చెబుతున్నారు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాదీక్ష శిబిరంలో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేశారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి పోలీసులకు వాహనాలు కొనిచ్చారని.. ఆ సొమ్ము అంతా ఎక్కడ నుంచి ఇచ్చారని ప్రశ్నించారు. చైనాకు వెళ్లిన సీఎం కేసీఆర్ ఎంత ఖర్చు చేశారో చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని..ఈ అవినీతి ఒక్కరోజు ఆపేసినా.. తెలంగాణలోని రైతుల అప్పులు తీర్చొచ్చని చెప్పుకొచ్చారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేసిన ఈ పరిష్కారం పట్ల తెలంగాణ అధికారపక్ష నేతలు ఎలా స్పందిస్తారో..?
Tags:    

Similar News