ఏపీ తొలి సీజే డిసైడ్ చేసేశారు

Update: 2019-10-04 04:59 GMT
రాష్ట్ర విభజన తర్వాత ఆలస్యంగా పూర్తి అయిన ప్రక్రియల్లో హైకోర్టు విభజనగా చెప్పాలి. ఎట్టకేలకు హైదరాబాద్ నుంచి ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ కు తరలి రావటం.. సీజేగా తాత్కాలికంగా నియామకం కావటం తెలిసిందే. పూర్తిస్థాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికను చేపట్టలేదు. తాజాగా ఆ లోటు పూరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపికను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఏపీ తొలి సీజేగా నియమితులయ్యారు.

మధ్యప్రదేశ్ హైకోర్టులో నంబరు టూ స్థానంలో ఉన్న జస్టిస్ మహేశ్వరి నియామకాన్ని న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రపతి సైతం నియామకానికి ఓకే చెప్పేయటంతో.. ఆయన ఏ రోజు నుంచి విధులకు హాజరవుతారో.. అప్పటి నుంచి సీజేగా జస్టిస్ మహేశ్వరి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.

1961 జూన్ 29న జన్మించిన ఆయన.. 1985లో లాయర్ గా ఎన్ రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఆయనకు సివిల్.. క్రిమినల్.. రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబరు 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులైన ఆయన.. 2008లో పర్మినెంట్ న్యాయమూర్తి అయ్యారు. తాజాగా ఏపీకి తొలి సీజేగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే.. ఆయన పదవీ బాధ్యతల్ని ఎప్పటి నుంచి స్వీకరిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. పలువురి అభిప్రాయాల ప్రకారం దసరా సెలవుల తర్వాతే ప్రమాణస్వీకారం ఉందంటున్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తించటం తెలిసిందే. గడిచిన తొమ్మిది నెలలుగా తాత్కాలిక సీజేగా వ్యవహరిస్తున్న ఆయన స్థానంలో మహేశ్వరి బాధ్యతలు చేపడతారు. దసరా పండుగ తర్వాతే ఆయన బాధ్యతల్ని స్వీకరించే వీలుందన్న మాట వినిపిస్తోంది.  ఇక.. ఆయన పదవీ విరమణ 2023 జూన్ 28న చేసే అవకాశం ఉందంటున్నారు
Tags:    

Similar News