జస్టిస్ కనగరాజ్ కు మరో షాక్ తప్పదా?

Update: 2021-09-07 23:30 GMT
మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.కనగరాజ్ పేరు ఆంధ్రా ప్రజలకు సుపరిచితమే. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్థానంలో ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ ను ఏపీ ప్రభుత్వం నియమించడం, ఆ తర్వాత ఆ నియామకం చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పుతో నిమ్మగడ్డ తన పదవిని చేపట్టడంతో జస్టిస్ కనగరాజ్ కు ఒకసారి భంగపాటు తప్పలేదు. అయితే, జస్టిస్ కనగరాజ్ కు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏపీ పీఏసీ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ, గతంలో మాదిరిగానే ఈసారి కూడా నిబంధనలు అతిక్రమించి మరీ ఏపీ ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్ ను నియమించిందని ప్రతిపక్ష నేతలు ఆనాడే ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కంప్లయింట్‌ అథారిటీ రూల్స్‌- 2020లోని సెక్షన్‌ 4(ఏ) ప్రకారం రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని పీఏసీ చైర్మన్‌గా నియమించాలని, పీఏసీ చైర్మన్...65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడేళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చన్నది నిబంధన. అంటే, పదవి చేపట్టేనాటికి 65 ఏళ్లు నిండిన వారు ఈ పోస్టుకు అనర్హులని రూల్స్ చెబుతున్నాయి. కానీ, జస్టిస్ కనగరాజ్‌ వయస్సు దాదాపు 75 ఏళ్లు. కాబట్టి రూల్స్‌ ప్రకారం అయుతే ఆయన ఆ పోస్టుకు అనర్హులని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా జస్టిస్ కనగ రాజ్ నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయవాది పారా కిషోర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆయన నియామకం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని, దురుద్దేశ్యపూర్వకంగా ఈ నియామకాన్ని చేపట్టారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను కోర్టు స్వీకరించగా...అది గురువారం బెంచ్ మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో, మరోసారి జస్టిస్ కనగ రాజ్ కు భంగపాటు తప్పదని విమర్శలు వస్తున్నాయి. మరి, కనగరాజ్ నియామకంపైన కోర్టులో దాఖలైన పిటీషన్ పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News