దేశ చ‌రిత్ర‌లో జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ స‌రికొత్త రికార్డు.. సుప్రీంకోర్టు కార్య‌కలాపాలు లైవ్‌

Update: 2022-08-26 06:54 GMT
భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రికార్డు చోటు చేసుకుంది. భారత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. జస్టిస్ ఎన్ వీర‌మ‌ణ అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు సుప్రీం కోర్టులో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని బాహ్య ప్ర‌పంచానికి.. కోర్టులో జ‌రిగే కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

తాజాగా సుప్రీం కోర్టు కార్య‌క్ర‌మాల లైవ్ ప్ర‌సారం అయింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీంకోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ హిమా కోహ్లీతో బెంచ్ను పంచుకున్నారు.

ఈ త్రిసభ్య ధర్మాసనం విచారణలు జరుపుతోంది. తొలిసారిగా సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇప్పటివరకు అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు, న్యాయ వ్యవస్థలో అందరి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన పలు చర్యలు చేపట్టారు.

భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో తెలుగు తేజంగా చరిత్ర పుటల్లో స్థానం దక్కించుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ, తనపై ప్రజల అంచనాలను అందుకునేందుకు అహర్నిశలు శ్రమించారు.

న్యాయ వ్యవస్థను వేధిస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలూ సూచించారు. తన పరిధిలోని అంశాలను వేగంగా పరిష్కరించి చూపి భావి సీజేఐలకు మార్గదర్శిగా మారారు. తాజాగా సుప్రీం కోర్టు కార్య‌క‌లాపాల‌ను ఆయ‌న ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందించి.. న్యాయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News