మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయంట

Update: 2015-07-06 04:19 GMT
న్యాయం కోసం కోర్టు గడప ఎక్కితే న్యాయం ఎప్పటికి అందుతుంతో తెలీని పరిస్థితి. పెద్దఎత్తున పేరుకుపోయిన కేసులతో కోర్టు విపరీతమైన పని భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. మరి.. కోర్టులలోపెండింగ్‌ ఉన్న కేసుల మాటేమిటి? అసలు దేశ వ్యాప్తంగా ఎన్నికేసులు వరకూ పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాన్ని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణ అమెరికాలోని నిర్వహిస్తున్న తానా మహాసభల్లో వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటి పరిష్కారం కోసం పెద్దఎత్తున కృషి చేయాలని చెప్పారు. అమెరికాలో ప్రతి పదిలక్షల మంది జనాభాకు 150 న్యాయమూర్తులు ఉంటే.. భారత్‌లో మాత్రం కేవలం 13 మంది మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు.

కోట్లలో పేరుకు పోయిన కేసుల్ని త్వరితగతిన క్లియర్‌ చేయాలంటే.. పెద్ద ఎత్తున కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు. కోర్టుల పెంపు విషయానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రత్యేక శద్ధ్ర చూపించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతగా చెప్పినా.. కోర్టుల సంఖ్య పెంపు విషయంలో ఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన దాఖలాలు కనిపించవు. రోజులు గడిచే కొద్దీ కేసుల సంఖ్య పెరిగిపోవటం.. న్యాయస్థానాల మీద ఒత్తిడి మరింత పెరగటం తప్పించి.. న్యాయం వెనువెంటనే లభించే అవకాశం కనుచూపు మేరలో కనిపించని దుస్థితి.



Tags:    

Similar News