పిల్ల పిశాచులు ఎంత ప్రమాదకరమంటే..?

Update: 2015-12-23 05:38 GMT
‘’18 ఏళ్ల లోపు ఉన్న వారు చేసే ఎంతటి తీవ్ర నేరాలకు అయినా వారిని బాల నేరస్తులుగానే పరిగణించాలి’’ అన్నది చట్టం చెప్పే మాట. మరి.. చట్టం చెప్పే మాటను కాసేపు పక్కన పెట్టి.. 18 ఏళ్ల లోపు ఉన్న వారు చేసే నేరాలు చూస్తే నోట మాట రాని పరిస్థితి. చట్టమేమో చిన్నోళ్లుగా చెబుతున్నా.. వారు చేసే నేరాల తీవ్రత పెద్దగా ఉండటం గమనార్హం.

నిర్భయ ఉదంతంలో కావొచ్చు.. హర్యానాలో ఒక నేపాలీ మానసిక వికలాంగురాలి విషయంలో కానీ జరిగిన సామూహిక అత్యాచారం.. దారుణమైన హింస.. బాధితరాలి పట్ల వ్యవహరించిన ధోరణి ఒక ఎత్తు అయితే.. ఈ ఘటనలతో మైనర్లకు సంబంధం ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇదిలా ఉంటే.. 18 సంవత్సరాల వయసు కంటే తక్కువగా ఉన్న వారు చేసే నేర తీవ్రత ఆధారంగా శిక్ష విధించాలంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మేజర్లుగా 18 ఏళ్లు కాదని.. 16 ఏళ్లకు కుదించాలన్న డిమాండ్ పై కొందరు మేధావులు స్పందిస్తూ.. ఒకవేళ అలాంటి చట్టం చేసినా.. 15 సంవత్సరాల 10 నెలల వయసులో ఇలాంటి నేరం చేస్తే ఏం చేస్తారు? అని అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.

నిజమే.. ఇలాంటి అతి తెలివిగా ఆలోచించేవారు.. చట్టంలోని మినహాయింపులతో నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే.. వయసు ఎంతన్నది కాదు.. వారు చేసిన నేరం తీవ్రత.. నేరంలో బాల నేరస్తులుగా చెప్పే వారి పాత్రను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదకరమైన జంతువు ఏదైనా సరే.. హాని చేస్తుందంటే దాన్ని చంపేయటమో లేదంటే.. దాని కారణంగా ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా.. నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామో.. పిల్ల పిశాచుల విషయంలోనూ అదే తీరును ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. సమాజానికి తీవ్ర ముప్పు కలగటం ఖాయం.

2012 నుంచి 2014 వరకు నమోదైన నేరాల్లో బాలనేరస్తుల (18 ఏళ్ల లోపు వారు) పాత్రను చూస్తే.. వారి నేర తీవ్రత కళ్లకుకట్టినట్లుగా కనిపిస్తుంది. పేరుకు చిన్నోళ్లే అయినా.. పెద్ద పెద్ద నేరాల్లో వారి పాత్ర భారీగా ఉందన్న విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు 2012 సంవత్సరాన్ని తీసుకుంటే.. ఒక్క అత్యాచారాలే 1175 చేసినట్లుగా నేరాలు నమోదయ్యాయి. ఇది.. 2013 నాటికి 1884గా నమోదు అయితే.. 2014 నాటికి 1989 కేసులు నమోదు కావటం గమనార్హం. ఇక.. తీవ్ర నేరమైన హత్య విషయానికి వస్తే.. 2012లో 990 మంది బాలనేరస్తులుగా నమోదు అయితే.. 2013లో ఈ సంఖ్య 1007 అయ్యింది. ఇక.. 2014 వచ్చేసరికి 841గా ఉంది. అత్యాచారాలు.. కిడ్నాప్.. హత్యలు.. హత్యాయత్నం.. మహిళల్ని వేధించటం.. అత్యాచార యత్నం.. ఇలాంటి తీవ్రమైన నేరాల్లో బాల నేరస్తులు 2012లో 4,626 నేరాలకు పాల్పడితే..2014 నాటికి ఈ నేరాల సంఖ్య 6,813 పెరగటం చూసినప్పుడు.. బాల నేరస్తుల విషయంలో చట్టం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతన్నది స్పష్టంగా అర్థమవుతుంది.

నేరాలకు పాల్పడే వారి విషయంలో చిన్నా.. పెద్దా అన్న తేడా కంటే కూడా.. నేర తీవ్రత ఆధారంగా శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. నేరానికి కఠిన శిక్షలు తప్పవని.. ఇందుకు మినహాయింపులు అరుదుగా ఉండాలే తప్ప.. ఒక అవకాశాన్ని కల్పించేలా ఉంకూడదన్న విషయాన్ని పాలకులు మర్చిపోకూడదు. ఇక.. మేధావులు.. తమ మేధోతనాన్ని బాధితులకు అండగా ఉండేలా నిలవాలి కానీ.. ప్రపంచ ప్రజలకు భిన్నంగా ఆలోచిస్తామంటూ.. నేరాలకు పాల్పడిన వారి విషయంలోనే దయను ప్రదర్శించటం ఏమాత్రం సమంజసం కాదన్న విషయం మర్చిపోకూడదు.
Tags:    

Similar News