సింధియా.. కూరలో కరివేపాకా?

Update: 2020-06-07 13:30 GMT
కాంగ్రెస్ అంటే ప్రాణమిచ్చే సింధియా తనకు పదవి ఇవ్వనందుకు ఏకంగా సొంత ప్రభుత్వాన్నే కూల్చాడు. కాషాయ కండువా కప్పుకొని కమలదళంలో చేరాడు. అయితే బీజేపీలో చేరినా సింధియాకు ఏ పదవి దక్కలేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయాడా అన్న వాదన వినిపిస్తోంది.

మధ్యప్రదేశ్ లో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  జ్యోతిరాధిత్య సింధియా కూల్చాడు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అసమ్మతి రాజేసి బీజేపీలో చేరాడు. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా మారాడు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ తో పొసగక బీజేపీని వీడుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

ఈ పుకార్లపై తాజాగా యువనేత జ్యోతిరాధిత్య సింధియా స్పందించారు. అవన్నీ సత్యదూరమని.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. తాజాగా నిజం కంటే అబద్దమే వేగంగా వ్యాపిస్తుందని ట్వీట్ చేశారు. పుకార్లను నమ్మవద్దని.. బీజేపీలోనే ఉంటానని సింధియా స్పష్టం చేశారు. కొందరు తన పాపులారిటీని భరించలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే సర్దిచెప్పుకుందామన్న సింధియాను బీజేపీ అధిష్టానం లైట్ తీసుకుంటేనే ఉంది. అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కానీ.. కేంద్రంలో కానీ ఆయనకు ఎలాంటి పదవిని ఇంతవరకు ఇవ్వలేదు. సింధియాను కూరలో కరివేపాకులా తీసివేస్తున్నారని ఆయన అనుచరగణం వాపోతోంది.
Tags:    

Similar News