ఆంధ్రోడికి తెలంగాణ దన్ను

Update: 2016-07-29 04:35 GMT
నమ్మినా.. నమ్మకున్నా ఇది నిజం. గురువారం (జులై 28) సాయంత్రం ముందు వరకు ఈ మాటను ఎవరైనా చెప్పి ఉంటే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ.. మూడున్నర గంటల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రవేశ పెట్టినప్రైవేటు బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఆంధ్రోడుకి తెలంగాణాటోడు అండగా నిలిచారని బలంగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో తరచూ వినిపించిన ‘విడిపోయి కలిసి ఉందాం’ నినాదానికి నిన్నటిరోజున తెలంగాణనేతలు రాజ్యసభలో అనుసరించిన విధానమే నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇరువరి ప్రయోజనాల కోసం ఒకరికొకరు పోటీ పడ్డా.. పోట్లాడుకున్నా.. తెలుగోడికి ఏదైనా జరిగితే ఒకరికొకరు అండగా ఉంటానన్న మాటను ‘తెలంగాణ’ నేతలు చేతల్లో చేసి చూపించారు. నిష్ఠూరంగా ఉండే నిజాన్ని చెప్పాలంటే.. ఏపీకిప్రత్యేక హోదా బిల్లు మీద రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఏపీ అధికారపక్ష నేతలతో పోలిస్తే.. తెలంగాణకు చెందిన టీఆర్ ఎస్.. కాంగ్రెస్ నేతలు బలంగా మాట్లాడారని చెప్పొచ్చు. సిగ్గుచేటైన ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా కవర్ చేసుకుంటారో కానీ.. ఏపీ కోసం తెలంగాణ నేతలు వినిపించిన వాణిని విన్నప్పుడు మాత్రం ఆంధ్రోడికి నిజమైన ఆనందం కలుగుతుందని చెప్పాలి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లుపై తెలంగాణకు చెందిన ఇద్దరు నేతలు మాట్లాడారు. వారిలో ఒకరు తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ ఎస్ కు చెందిన కేకే ఒకరైతే.. మరొకరు కాంగ్రెస్ కు చెందిన రేణుకా చౌదరి. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తమ మద్దతు ఉంటుందన్న కేకే.. రాజ్యసభలోని సభ్యులెవరూ తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. విభజన చట్టం రెండు తెలుగురాష్ట్రాలకు సంబంధించిన అంశమైనా తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడలేదంటూనే.. ‘ఆంధ్రప్రదేశ్ మిత్రులు అడిగిన ప్రతి అంశానికి నా మద్దతు ఉంటుంది. బిల్లులో ఉన్న అంశం కానీ లోక్ సభలో ఇచ్చిన హామీలు కానీ అమలవ్వాలి’’ అంటూ తేల్చి చెప్పారు.

ఇక.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న మాటను బలంగా వినిపించారు. ఈ సందర్భంగా ఆమె కాస్తంత భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘మేమేమన్నా అడుక్కుంటున్నామా?రాజకీయ ప్రయోజనమా? లేక ప్రాంతీయ ద్వేషమా? తెలుగువాళ్లే కదా.. ఏమవుతుందిలే అని తక్కువగా అంచనా వేయమాకండి. ఐదు కోట్ల ఆంధ్రుల పట్టుదల చూడండి. మంచితనం బలహీనత కాదని గ్రహిస్తారు మీరు. ద్రవ్య బిల్లు అని సాకులు చెబుతూ తప్పుకోవాలని చూస్తున్నారా?’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి చెందిన అధికారపక్ష సభ్యులతో పోలిస్తే.. తెలంగాణకు చెందిన నేతలే ప్రత్యేక హోదా అంశంపై బలంగా.. స్పష్టంగా.. సూటిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని తేల్చి చెప్పారు.
Tags:    

Similar News