ఈ రోజుతో ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పడుతుందా?

Update: 2019-10-15 04:34 GMT
గడిచిన పదకొండు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పడనుందా? 48 వేల మంది కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయ్యారని.. వారిని మళ్లీ చేర్చుకునేదే లేదని తెగేసి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కఠినత్వాన్ని తగ్గించుకోనున్నారా? తన మాట వినక సమ్మె చేస్తున్న వారికి షాకులు ఇచ్చేందుకు వెనుకాడని సీఎం.. కాస్త వెనక్కి తగ్గాలని డిసైడ్ అయ్యారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఏదో జరుగుతుందంటే.. మరేదో జరుగుతుండటంతో.. రోజులు గడిచే కొద్దీ ఆర్టీసీ సమ్మె అంతకంతకూ ముదిరిపోవటం.. ప్రభుత్వం పరేషాన్ అయ్యేలా పరిణామాలు చోటు చేసుకోవటంతో.. తనకు అత్యంత నమ్మకస్తుడు.. విధేయుడైన కేకేను మధ్యేమార్గంగా రంగంలోకి దింపారు కేసీఆర్. ఆయన కోరుకున్నట్లే.. సమ్మె విరమణకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యేందుకు వీలుగా కేకే చేసిన ప్రకటనతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పటికే ఇద్దరు ఉద్యోగుల ప్రాణ త్యాగాలు.. పలువురి ఉద్యోగుల మరణాలతో ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ ప్రజానీకం పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ.. మరికొంతకాలం సమ్మె కొనసాగితే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనకు టీఆర్ ఎస్ సర్కారు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. మధ్యేమార్గంగా కేకేను రంగంలోకి దింపి సమ్మెను విరమించేలా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇందుకు తగ్గట్లే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తప్పించి.. మిగిలిన డిమాండ్ల మీద మాట్లాడుకుందామన్న కేకే ప్రకటనపై ఆర్టీసీ జేఏసీ నేతలు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో పేచీ పడేందుకు ఏ మాత్రం ఇష్టం లేని జేఏసీ నేతలు.. ప్రభుత్వం నుంచి కాస్తంత సానుకూలత లభించినా సమ్మెను విరమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వంతో పోరాడే శక్తి లేకపోవటం.. విపక్షాలు ముందుకు వచ్చినప్పటికి..ఉద్యోగ సంఘాలు మాత్రం అనుకున్న స్థాయిలో సహకారం అందించని నేపథ్యంలో.. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం కాస్త సానుకూలంగా ఉంటే చాలు.. సమ్మెను విరమిద్దామన్న ఆలోచనలో ఉన్నాయి. ఇదే సమయంలో కేకే ఎంట్రీ ఇచ్చి.. మధ్యవర్తిత్వం నడపటానికి.. ప్రభుత్వంతో చర్చలు జరపటానికి తాను సిద్ధమని ప్రకటించటంతో ఈ రోజు (మంగళవారం) కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ రోజు సమ్మెను విరమిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News