తల్లిపాలు.. పోతపాలు అంటూ ఏం చెప్పావ్

Update: 2015-08-08 06:09 GMT
ఇష్టారాజ్యంగా ఏపీని ముక్కలు చేసేసి ఆంధ్రుల గొంతును కాంగ్రెస్ రాజకీయ కత్తితో కోసి పారేస్తే.. కాంగ్రెస్ దుర్మార్గాన్ని నిలదీసి.. మీకెందుకు మేం ఉన్నామంటూ చెప్పిన కమలనాథులు సైతం అలాంటి కత్తితోనే ఏపీ గొంతును మరోసారి కోసే ప్రయత్నం చేయటం తెలిసిందే.

విభజన పుణ్యమా అని ఏపీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దెబ్బ తీస్తే.. ఇకపై కోలుకునే అవకాశం లేకుండా ఉండేలా.. మోడీ అండ్ కో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో మాటిచ్చిన కమలనాథులు ఇప్పుడు మాత్రం ఆచరణ సాధ్యం కాదని తేల్చేయటం తెలిసిందే.

ప్రత్యేక హోదా బదులుగా ఏపీకి నిధులు ఇస్తామంటూ ఇప్పుడు కొత్త రాగం ఆలపించటం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ఏపీ జర్నలిస్టుల ఫోరం.. ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన సందర్భంగా.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ప్రత్యేక హోదా తల్లిపాలతో సమానమైతే.. నిధులు ఇవ్వటం పోతపాలు మాదిరివంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీకి మధ్య తల్లిపాలు.. పోతపాలు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందని అసలు విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పారు. మోడీకి మౌత్ పీస్ అయిన వెంకయ్య పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సన్మానాలు చేయించుకున్నారని.. ఇప్పుడేమో ప్రణాళికా సంఘం.. ఆర్థిక సంఘం అంటూ తప్పించుకున్నారని వ్యాఖ్యానించారు. కామ్రేడ్ నారాయణ చెప్పిన తల్లిపాలు.. పోతపాల తేడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు ఎప్పటికి అర్థం అవుతుందో..?
Tags:    

Similar News