రాజీనామాతో సరెండర్ అయిన దర్శకుడు రాఘవేంద్రరావు!

Update: 2019-05-27 11:01 GMT
టీటీడీ ఆధ్వర్యంలో నడించే భక్తి చానల్ ఎస్వీబీసీ కి రాఘవేంద్రరావు చైర్మన్ గా వ్యవహరించిన సంగతి బహుశా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. పెద్దగా ప్రచారం లేకపోయినా.. ఆ చానల్ లో రాఘవేంద్రరావు చెప్పిందే వేదంగా నడిచిందనే ప్రచారం కూడా ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రాఘవేంద్రరావు అత్యంత సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్ లో కూడా రాఘవేంద్రరావు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందారనే ప్రచారం ఉంది.

ఇక ఐదేళ్ల కిందట తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా రాఘవేంద్రరావు టీటీడీ బోర్డులో స్థానం సంపాదించారు. ఏకంగా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే చానల్ కు చైర్మన్ గా పాగా వేశారు. ఆ చానల్ కు కోట్ల రూపాయల టీటీడీ నిధులు అందుతాయి. దీంతో ఆ పదవికి కొంత పవర్ ఉండనే ఉంది. ప్రత్యేకించి ఆ చానల్ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్  రూపొందించాల్సి ఉంటుంది కాబట్టి.. సినిమా వాళ్లకు అది లాభసాటి వ్యవహారం అని అంటారు.

అలా టీటీడీ చానల్ చైర్మన్ గా వ్యవహరిస్తూ రాఘవేంద్రరావు చానల్ లో తన హవాను సాగించాడని అంటారు. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో నామినేటెడ్ పోస్టులు పొందిన వారికి సీన్ అర్థం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్లు తమను ఎలాగూ తొలగిస్తారని - అవినీతి ఆరోపణల వ్యవహారాలు చర్చకు వస్తాయని వారిలో ఒక్కొక్కరుగా వాటిని వదులుకుంటూ వస్తున్నారు.

ఇప్పటికే ఇలాంటి 'చైర్మన్' హోదాల్లో ఉన్న వారు  వాటికి రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు కూడా జాబితాలో చేరారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసి తప్పుకున్నారు. అదేమంటే.. పార్టీ మారిన రీజన్ ను చెప్పకుండా, తనకు వయసు మీద పడిందని ఆయన చెప్పుకొచ్చారట. అయినా ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు రోజులకే వయసు మీద పడిందా అనే సెటైర్లు తప్పడం లేదు!
Tags:    

Similar News