వైసీపీ రాజీనామాల‌కు ట్విస్ట్ ఇచ్చిన క‌మ్యూనిస్టులు

Update: 2016-10-26 17:30 GMT
ప్రత్యేక హోదాను ప్రకటించకుంటే శీతాకాలం పార్లమెంటు సమావేశాల తర్వాత తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ  అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాలు స‌రైన‌వి అయిన‌ప్ప‌టికీ...వైసీపీ కంటే ఎన్నికల హామీని విస్మరించిన బీజేపీ తమ ఎంపీలు - ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి - టీడీపీ సహాయం తీసుకొని ఏ ఒక్కరు గెలిచినా తాము ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోతామని రామ‌కృష్ణ‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల్లో ఒక్క బీజేపీ మాత్రమే ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చి తీరా గెలిచిన తర్వాత మాట మార్చడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రతిపక్షాలు - మేధావులు - ప్రజాసంఘాలు కోరుతుంటే కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని సీఎం సహా ఏపీకి చెందిన కేంద్రమంత్రులు కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్యాకేజీనే మహాద్భాగ్యమంటూ కేంద్రాన్ని అడుక్కోవడం ఏమిటి? అని ప్రశ్నించారు.

రాజకీయ స్వార్ధం కోసం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆత్మాభిమానాన్ని కేంద్రం వద్ద పణంగా పెడుతున్నారని రామ‌కృష్ణ‌ విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత పేరుతో సీఎం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యుల్ 9 - 10లో ఉన్న 107 ప్రభుత్వ సంస్థల విభజన పూర్తి కాకుండానే హైదరాబాద్‌ ను వదిలి వచ్చేయడానికి నోటుకు ఓటు కేసే ప్రధాన కారణమన్నారు. తెలంగాణతో సామరస్యంగా ఉంటూ ప్రభుత్వ సంస్థల విభజన సజావుగా జరిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా కావాలని రాష్ట్రంలో 90 శాతం ప్రజలు కోరుతున్న విషయాన్ని ప్రజాబ్యాలెట్ ద్వారా స్పష్టమైందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబరు 10న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి సీపీఐ తరపున సంపూర్ణ మద్దతును ప్రకటించారు. హోదా పై తొలి ఉద్యమం అనంతపురంలోనే గత ఏడాది మార్చి 11న ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో నాలుగు రాష్ట్రాల‌కు కృష్ణాజలాల పంపిణీ జరగకుండా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలుచేస్తే ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ చోద్యం చూస్తోందని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఈ విషయమై ఎవరు కార్యక్రమం చేపట్టినా తాము సంఘిభావం తెలియచేస్తామని రామకృష్ణ తెలిపారు.

ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ) వద్ద జరిగిన ఎన్ కౌంట‌ర్‌ ను ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని రామ‌కృష్ణ కోరారు. రాష్ట్ర డీజీపీ సాంబశివరావు కట్టుకధ చెబుతున్నారని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంట‌రేనని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్తులను నిరాయుధులను చేసి మరీ చంపేశారని ఈ ఘ‌ట‌న‌పై హైకోర్డు సిట్టింగ్ జడ్డి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. నక్సల్స్ అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలసి ప్రజాసమస్యలపై వామపక్షపార్టీలతో కలసి పనిచేయాలని రామ‌కృష్ణ పిలుపునిచ్చారు. మైదాన ప్రాంతాల్లో ప్రజలు ఉంటున్నందున అడవుల్లో ఉండడం సరికాదన్నారు. విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం వల్ల త్యాగాలు వృధా అవుతున్న విషయాన్ని  గమనించాలన్నారు. దేశ-రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధి నిరోధకశక్తులు, మతోన్మాద శక్తులు, కార్పోరేట్ల అండతో ప్రభుత్వాలు లౌకికవాదాన్ని పాతరేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News