ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు: కేఏ పాల్

Update: 2023-02-14 14:00 GMT
'ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు'.. ఈ మాట వినగానే రేవంత్ రెడ్డో, బండి సంజయో, ఈటల రాజేందర్ అన్నారనుకుంటాం. కానీ, వారెవరూ కాదు.. ఇప్పటివరకు ఒక్క ఎన్నికల్లో కూడా డిపాజిట్ దక్కని పార్టీ ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్టేట్మెంట్ ఇది.

బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని.. వారు తన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేఏ పాల్ చెప్పారు. అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14న దీనిపై మరిన్ని వివరాలు తెలుస్తాయని పాల్ చెప్పారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడిస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాల చేతిలో ఉంటుందని అన్నారు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో విలువలు ఉన్నవారు, నిజాయతీ గల వారు 15 శాతం వరకు ఉన్నారని పాల్ చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని... తెలంగాణలోని 70 శాతం మంది ప్రజల ఆకాంక్ష ఇదేనని అన్నారు.

దేశంలో అరాచక పాలన నడుస్తోందని... మోదీ, అదానీ ఇద్దరూ కలిసి దేశం పరువు తీస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. తాను కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులతో మాట్లాడుతున్నానని తెలిసి తన ఫోన్‌పై కేసీఆర్ ప్రభుత్వం నిఘా పెట్టిందని పాల్ ఆరోపించారు.

కాగా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని పాల్ చెప్పడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ ఇప్పటివరకు ఎన్ని ఎన్నికల్లో పోటీ చేసిందో... ఎన్నిసార్లు డిపాజిట్ వచ్చిందో చెప్పాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. మునుగోడు ఎన్నికలకు ముందు పాల్ పలికిన ప్రగల్భాలన్నీ మీమ్స్ రూపంలో గుర్తుచేసి పాల్‌పై సెటైర్లువేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను కాదని ప్రజాశాంతి పార్టీలోకి వెళ్లానని అనుకునే ఎమ్మెల్యేలు ఉంటే వారికంటే రాజకీయ అజ్ఞానులు ఇంకెవరూ ఉండబోరంటూ కొందరు సోషల్ మీడియాలో డైరెక్టుగా జోకులేస్తున్నారు. మొత్తానికి పాల్ చెప్పిన మాటల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఆయన ఎలక్షన్ మూడ్‌లోకి వచ్చేశారని మాత్రం అర్థమైసపోతోంది.
 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News