ట్రంప్‌నే గెలిపించాను..బాబును ఓడించ‌లేనా?

Update: 2019-02-05 18:04 GMT
కేఏ పాల్....ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు. సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు సుప‌రిచితులు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్...ఇలా ఎవ్వరినీ వదలడంలేదు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం - ప్రతిపక్ష నేతకు సవాల్ విసిరారు. జనసేన అధినేతకు మాత్రం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఓటమి ఖాయం...ఆయనది రాక్షస పాలన అని మండిపడ్డారు. అమెరికాలో తాను ట్రంప్ నే గెలిపించా! అని తనకు తెలిసిన 2050 బిలియనీర్స్‌లో ఒక్కరైనా డబ్బు ఇవ్వరా? అంటూ ఎదురు ప్రశ్నించారు. 15  ఏళ్లలో చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారు? అని ప్రశ్నించారు.

టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, తప్పితే చేసిందేమీ లేదని కేఏ పాల్ ఆరోపించారు. `నాతో చంద్రబాబు, జగన్ మూడు డిబెట్లకు వస్తే వారి నిజస్వరూపం బయటపెడుతా..! కుప్పం - పులివెందులలో తాను పోటీకి సిద్ధం.. చంద్రబాబు - జగన్ సిద్ధమా?`` అంటూ సవాల్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఒంటరిగా వెళ్తే ఏమీ చేయలేరన్న పాల్.. ఎంతో ప్రజాదరణ ఉన్న చిరంజీవికే 18 సీట్లు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్... పవన్ కల్యాణ్ తనతో వస్తే యువత బాధ్యతలు అప్పగిస్తానని ఆఫర్ చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ తరహాలో తనను కూడా గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కోరారు. తాను ఒంటరిగా పోటీ చేస్తే వంద సీట్లు గెలుస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News