అప్పుడు పీఎం కాను..ముందు సీఎం నవుతా

Update: 2019-01-17 15:44 GMT
ఇప్పటికే ఏపీ సీఎం సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. జాతీయ పార్టీలు బీజేపీ - కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ ఎవరికి వారు అధికారం అందుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి. పార్టీల అధినేతలు కూడా నేను సీఎం అంటే నేను సీఎం అంటూ తమ కలలను జనంపై రుద్దుతున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు - విపక్ష నేత జగన్‌ తో పాటు జనసేన అధినేత పవన్ కూడా నేనే సీఎం అంటున్నారు. అయితే.. వీరు చాలరన్నట్లుగా కొద్దిరోజులుగా మరో నేత కూడా ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీ చేసి గెలుస్తానని.. తానే సీఎం అవుతానని అంటున్నారు. అంతేకాదు.. అభిమానులు ఆయన్ను పీఎం అని కూడా అంటుండడంతో అప్పుడే పీఎం పదవి వద్దు.. ఇప్పుడు సీఎం అయి ఆ తరువాత దాని సంగతి చూద్దామంటున్నారు.
   
ఇంతకీ ఈ నాయకుడిది ఏపీ స్థాయో - ఇండియా స్థాయో కాదు.. ఏకంగా ప్రపంచ స్థాయి నేత ఆయన. ఎందరో దేశాధినేతలతో కలిసి తిరిగి.. ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొనేలా మంచి మాటలతో వారిని మార్చిన విశ్వశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆయన. అవును.. కేఈ పాల్ తన రాజకీయ కార్యాచరణ వేగవంతం చేశారు. ‘‘జనసేనలాంటి చిన్నాచితకా పార్టీలు వస్తే ఓ నాలుగు సీట్లిస్తా’’ లేదంటే మొత్తం 175 సీట్లలో తమ పార్టీయే పోటీ చేస్తుందని ఆయన చెబుతున్నారు.
   
అంతేకాదు.. ప్రజలతో టచ్‌ లోకి వెళ్లేందుకు గాను నిన్నటి నుంచి ఆయన రోజూ రాత్రి 9 గంటలకు ఫేస్ బుక్ ద్వారా లైవ్‌ లోకి వచ్చి అభిమానులతో మాట్లాడుతున్నారు. ఆ క్రమంలోనే పాల్ అభిమానులు ఆయన్ను పీఎం అంటుంటే.. ఆయన మాత్రం అది నెక్స్ట్ చూద్దాం.. ఇప్పుడు సీఎం అవుతాను అంటున్నారు. అంతేకాదు..  అందరికీ రశీదు పుస్తకాలు పంపిస్తానని.. జనంలోకి వెళ్లండని సూచిస్తున్నారు. మరి, ఈ రశీదు పుస్తకాలు ఎందుకన్నదే తెలియాలి.
Tags:    

Similar News