రూ.1000 కోట్ల డీల్‌ కుదిరింది: బాబు- పవన్‌ భేటీపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-09 05:26 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైన సంగతి తెలిసిందే. స్వయంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్‌ ఆయనతో దాదాపు 2.30 గంటల పాటు సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీసింది.

అంతా ఊహించినట్టే.. జనసేన–టీడీపీ పొత్తు కుదరకూడదని భావిస్తున్న వైసీపీ నుంచి తీవ్ర ఆరోపణలు, తీవ్ర విమర్శలు ఈ భేటీపై వ్యక్తమయ్యాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా పవన్‌ తమతో పొత్తులో ఉండి ఇలా చేయడమేంటని మథనపడుతున్నట్టు టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పవన్‌ డీల్‌ కుదుర్చుకున్నాడని, రూ.1000 కోట్లకు ఈ ఒప్పందం కుదిరిందని కాపులను చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ అమ్మేస్తున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రూ.1500 కోట్లకు కాంగ్రెస్‌ పార్టీకి అమ్మేశాడని.. ఇప్పుడు పవన్‌ 1000 కోట్లకు కాపులను అమ్మేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్‌ ఈ డీల్‌ లో కీలక పాత్ర పోషించాడని కేఏ పాల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేష్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి నాదెండ్ల మనోహర్‌ ఈ రూ.1000 కోట్ల డీల్‌ ను కుదిర్చాడని ఆరోపించారు. తద్వారా పవన్‌ కళ్యాణ్‌ కు సంక్రాంతి కానుక అందిందని ఎద్దేవా చేశారు.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌ కల్యాణ్‌ యువ రాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించారని కేఏ పాల్‌ గుర్తు చేశారు. ఆ సమయంలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.

ఇప్పుడు పాల్‌ కామెంట్లు వైరల్‌ గా మారాయి. మరోవైపు వైసీపీ నేతలు సైతం ఇదే ఆరోపణ చేస్తున్నారు. 2014లో పవన్‌.. చంద్రబాబుకు, బీజేపీకి మద్దతు ఇచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు ఇవే విమర్శలు చేస్తున్నారు. పవన్‌ ప్యాకేజీ స్టార్‌ అని మండిపడుతున్నారు. మరోమారు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తెచ్చుకోవడానికే పవన్‌ వెళ్లారని ధ్వజమెత్తుతున్నారు. కేఏ పాల్‌ సైతం వైసీపీ నేతల బాటలోనే విమర్శలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News