పాల్ సరదా ఈసారైనా తీర్చండి బాబూ...

Update: 2022-10-15 06:30 GMT
ఆయన మత బోధకుడు.  నాలుగు మంచి మాటలు సమాజానికి చెప్పే ఆధ్యాత్మికపరుడు. ఆయన సడెన్ గా రాజీకీయాల మీద వ్యామోహం పెంచుకున్నారు. ఆయనే కే ఏ పాల్. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గి చట్ట్ సభలోకి రావాలని ఉంది. అయితే దానికి ముందు ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలి కదా. ఇక  నామినేషన్ దశలోనే ఆయన పత్రాలు రిజెక్ట్ అవుతున్నాయి.

2019 ఎన్నికల్లో పాల్ నర్సాపురం నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకున్నారు. ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కానీ చివరికి అవి ఎన్నికల సధికారులు తిరస్కరించారు. సరైన డాక్యుమెంట్స్ పొందుపరచలేదని వాటిని పక్కన పెట్టేశారు. ఆ విధంగా పాల్ పోటీ చేయాలనుకున్న తొలి కోరిక వీగిపోయింది.

ఇక ఇపుడు మునుగోడు ఉప ఎన్నికల్లో అనూహ్యంగా పాల్ బరిలోకి దిగిపోయారు. ముందు అనుకున్నట్లుగా తన పార్టీ తరఫున ప్రజా గాయకుడు గద్ధర్ ని అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే గద్దర్ నామినేషన్ వేయలేకపోయారు. దాంతో పాల్ తానే ముందుకు వచ్చి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. అంతే కాదు టీయారెస్, బీజేపీ కాంగ్రెస్ లను ఓడించే మునుగోడు మొనగాడు తానే అని గర్జిస్తున్నారు.

ఇదిలా ఉండగా నిన్న నామినేషన్లకు చివరి రోజు  కావడంతో అభ్యర్థుల నుంచి హడావుడి నెలకొంది. నామినేషన్ల దాఖలుపై మీడియాతో మాట్లాడిన పాల్ గద్దర్‌తో కలిసి స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరారు. అయితే పోలీసు శాఖ అనేక అడ్డంకులు సృష్టించి గద్దర్‌ను నామినేషన్ దాఖలు చేయకుండా నిలిపివేసిందని పాల్ ఆరోపించారు. గద్దర్‌ను పోలీసులు నిర్బంధించారు,  వ్యక్తిగత భద్రత కూడా అతన్ని విడిచిపెట్టడానికి నిరాకరించింది అని పాల్ చెబుతూ తానే ఇక బరిలో ఉంటాను అని సంచలన నిర్ణయం తీసుకుని మరీ మునుగోడు ఉప ఎన్నికకు ప్రజాశాంతి పార్టీ అధినేతగా తన  దాఖలు చేశారు.

మునుగోడు ప్రజలు తనను ఆశీర్వదించి ఓటు వేయాలని పాల్ కోరుతున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ఈసారి అయినా పాల్ తన నామినేషన్ పత్రాలను సవ్యంగా దాఖలు చేశారా అన్న చర్చ వస్తోంది. ఒక వేళ కనుక ఆయన సరిగ్గా ఫైల్ చేయకపోతే నర్సాపురంలో జరిగినట్లుగానే రిజెక్ట్ అవుతాయా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా చట్టసభల లోకి వెళ్లడం  కంటే ముందు నామినేషన్ గండం నుంచి పాల్ గట్టెక్కితే ఆ మీదట కధ చూడాలి అంటున్నారు.

పాల్ ప్రజా సేవ కోసం ఆరాటపడుతున్నారు. కనీసం ఆయన నామినేషన్ ఓకే అయితే ఎన్నికల  రంగంలోకి అయినా వచ్చి తన కోరిక సరదా ఎంతో కొంత తీర్చుకుంటాడని అంటున్న వారూ ఉన్నారు. మరి పాల్ నామినేషన్ ఓకే అవుతుందా. ఇదీ ఇపుడు అతి పెద్ద చర్చగా ఉందిట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News