కడప కానిస్టేబుళ్ల ఆరాచకం మామూలుగా లేదుగా? ఒక మహిళ ప్రాణాన్ని తీసేశారట

Update: 2022-03-30 16:30 GMT
కడప జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల అతికి ఒక నిండు ప్రాణం ప్రాణాలు కోల్పోయిన వైనం సంచలనంగా మారింది. పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు గురి కావటమే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఎలా వ్యవహరిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. సంచలనంగా మారిన మహిళ మరణం.. ఇప్పుడు పోలీసుల శాఖను వేలెత్తి చూపేలా చేస్తోంది.

మహిళ మరణానికి కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేస్తామని కడప ఎస్పీ అన్బురాజన్ చెబుతున్నారు. అక్రమంగా అదుుపు లోకి తీసుకోవటంతో పాటు.. దారుణం గా హింసించి ఆమె ప్రాణాలు పోవటానికి కారణమైన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..

షేక్ మున్నీ అనే 30 ఏళ్ల మహిళ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తితో పెళ్లి అయ్యింది. కొంతకాలానికి వారిద్దరూ విడిపోయారు. దీంతో ఆమె.. కడప జిల్లాకు షిఫ్టు అయ్యారు. జిల్లాలోని పోరుమామిళ్లలో ఒక సూపర్ మార్కెట్ లో పని చేస్తున్నారు. అక్కడే రూం తీసుకొని తల్లితో కలిసి ఉంటున్నారు. సూపర్ మార్కెట్ యజమాని మాబు హుస్సేన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం సూపర్ మార్కెట్ లో మానేసిన మున్సీ.. ప్రకాశం జిల్లా గిద్దలూరుకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి మాబు కుటుంబంలో గొడవలు పెరిగాయి. ఈ పరిస్థితికి కారణం మున్నీనే భావించిన మాబు కుటుంబ సభ్యులు కడప జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల (సయ్యద్.. జిలానీ)ను  తమ వెంట పెట్టుకొని సోమవారం సాయంత్రం గిద్దలూరుకు వెళ్లారు. అక్కడ మున్నీని బలవంతంగా అదుపులోకి తీసుకొని వాహనంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమెను అమానుషంగా కాళ్లతో కొట్టుకుంటూ తీసుకెళ్లటం షాకింగ్ గా మారింది.

తన కుమార్తెను కానిస్టేబుళ్లు తన్నుకుంటూ తీసుకెళ్లారంటూ మున్నీ తల్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్రమంగా అదుపులోకి తీసుకున్న కడప కానిస్టేబుళ్లు ఇద్దరు.. మాబు ఉండే వీధిలో పడేశారు. అనంతరం ఆమెను చిత్ర హింసలకు గురి చేసి దారుణంగా గాయపరిచారు. ఈ గాయాలతో ఆమె మరణించినట్లుగా చెబుతున్నారు.

మున్నీ తల్లి ఫిర్యాదుతో కదిలిన పోలీసులు.. గాయపడిన ఆమెను తీసుకొని కడప రిమ్స్ కు తీసుకెళ్లారు. ఆమె మరణానికి కారణమైన పదకొండు మందిపై పోలీసులు హత్యారోపణల కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఏడుగురు పురుషులు.. నలుగురు మహిళలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ఉదంతానికి కారణమైన ఇద్దరు కడప కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకోనున్నట్లుగా కడప ఎస్పీ వెల్లడించారు. ఒక మహిళ మరణానికి కారణమైన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News