చంద్రబాబు రాజకీయ లక్ష్యాలే కడపకు శాపం

Update: 2017-04-14 11:56 GMT
జగన్ సొంత జిల్లా కడపలో పూర్తిస్థాయిలో టీడీపీ జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ జిల్లాకు సంబంధించిన రాజకీయాలను తప్ప మిగతా ఎలాంటి అభివృద్ధినీ పట్టించుకోవడం లేదు. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలే అందుకు ఉదాహరణ. ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో కడప జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. అక్కడి రాజకీయాలపైనే పూర్తిగా దృష్టిపెట్టిన చంద్రబాబు అక్కడి పిల్లల చదువులపై, విద్యా ప్రమాణాలపై ఏమాత్ర దృష్టిపెట్టలేదని అర్థమవుతోంది.
    
ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే... కడప జిల్లాకు ఇంఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయనే ఏపీ విద్యాశాఖ మంత్రి. సాక్షాత్తు ఏపీ విద్యాశాఖ మంత్రి ఇంచార్జిగా ఉన్న జిల్లాలో ఫలితాలు అత్యంత దారుణంగా ఉండడానికి కారణమేంటని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. కడప జిల్లా ఇంఛార్జిగా గంటాకు అప్పగించిన బాధ్యతలు అలాంటివి మరి. వైసీపీ నుంచి వచ్చి మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి - టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య విభేదాలు చల్లార్చడం.. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వైఎస్ వివేకాను ఓడించడం.. ప్రజాప్రతినిధులను డబ్బులిచ్చి కొనుగోలు చేయడం వంటి రాజకీయపరమైన, టీడీపీ పార్టీ పరమైన పనులన్నీ ఆయనకు అప్పగించారు. దీంతో గంటా చాలా నెలలుగా కడపలో ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే పనుల్లోనే మునిగితేలాల్సి వచ్చింది. దీంతో తాను ఇంచార్జిగా ఉన్న జిల్లాలో విద్యాపరిస్థితులపైనా ఆయన ఏమాత్రం కాన్సంట్రేట్ చేయలేకపోయారు. పదో తరగతి రిజల్టు కూడా అక్కడ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.
    
మరోవైపు కడప జిల్లాకే చెందిన కొత్త మంత్రి ఆదినారాయణ రెడ్డి దీన్ని చాలా జోక్ గా తీసుకున్నారు. నిన్న ఇంటర్ ఫలితాల విడుదల సమయంలో ఆయన కూడా ఉన్నారు. ఫలితాలు విడుదల చేయగా కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. దీనిపై ఆ జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డిని విలేకర్లు ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ఆదినారాయణరెడ్డి తాము లాస్ట్‌ నుంచి ఫస్ట్‌ లో ఉన్నామని జోకేశారు. నాయకులకు రాజకీయాలపైనే తప్ప ప్రజల అవసరాలు.. విద్య, వైద్యం వంటి జీవన ప్రమాణాలపై ఏమాత్ర శ్రద్ధ లేదనడానికి ఇది పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.  దీంతో చంద్రబాబు తన రాజకీయ క్రీడలో కడపను నాశనం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News