గ్రహాలు బాగోలేనప్పుడు ఈ మాటలేంది కడియం?

Update: 2016-08-10 04:44 GMT
టైం బాగోలేదని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా తొందరపడి మాట్లాడటం తెలివితక్కువతనమే అవుతుంది. ఉగాది అస్థానంలో విద్యా..వైద్య శాఖామంత్రుల మీద ఆరోపణలతో పాటు.. వారి శాఖలకు సంబంధించి అవినీతి మచ్చ పడుతుందని.. ఇదంతా తాను చెప్పటం లేదని.. శాస్త్రం చెబుతుందంటూ అయ్యవార్లు చెప్పిన మాటల్ని మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకూ కాసింత లైట్ తీసుకోవటం తెలిసిందే. శాస్త్రం తప్పు చేయదని.. ఉగాది అస్థానం రోజున చెప్పిన జోస్యం నిజమన్నట్లుగా ఎంసెట్ 2 వ్యవహారం చెప్పకనే చెప్పేసింది.

ఎంసెట్ 2 ఎపిసోడ్ సందర్భంగా పలువురు ఉగాది అస్థానాన్ని గుర్తు చేసుకోవటం.. నాటి అయ్యవార్లు హెచ్చరించిన తర్వాత అయినా జాగ్రత్త పడి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోటి నుంచి వినిపించింది. ఎంసెట్ 2 కారణంగా తెలంగాణ సర్కారుపై తీవ్రంగా బద్నాం కావటం.. విద్యా..వైద్య శాఖామంత్రుల పని తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతుండటం తెలిసిందే.

ఈ రెండు శాఖలతో పాటు మరికొందరు మంత్రుల్ని మంత్రివర్గం నుంచి తప్పించి క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరించాలన్నఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. తొందరపడి మాట్లాడి మరిన్ని విమర్శల్ని మూటగట్టుకోవాలని ఏ నేతా అనుకోరు. కానీ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యవహారం ఇదే తీరులో సాగుతోంది. ఉద్యోగుల విషయంలో తొందరపడి మాట అంటే అందుకెంత మూల్యం చెల్లించాలో రాజకీయ నాయకులకు ఎక్కువగా తెలుసు. అందులోకి ఉపాధ్యాయుల విషయంలో నోరు జారితే వెల్లువెత్తే వ్యతిరేకత తక్కువేం కాదు. మరి.. తన మీద తనకున్న నమ్మకమో.. ఆత్మవిశ్వాసమో కానీ కడియం శ్రీహరి తొందరపడినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడిన సందర్భంగా ఉపాధ్యాయుల మీద చేసిన విమర్శలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో మార్పు రాని పక్షంలో ప్రజలు తిరగబడే రోజులు వస్తాయంటూ చేసిన వ్యాఖ్యపై వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉపాధ్యాయులు ఫైళ్లు పట్టుకొని తిరగటం మాని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటానికి కృషి చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ.. ర్యాలీలు.. ధర్నాలు నిర్వహిస్తున్నాయి.

గ్రహాలు బాగోలేవని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ధర్మాగ్రహం కూడా దండగమారి వ్యవహారంలా మారుతుందన్న విషయాన్ని కడియం ఎందుకు గుర్తించటం లేదు? సామాజిక చైతన్యం ఎక్కువగా ఉండటం.. ఏదైనా విషయంలో తేడా వస్తే వారు చేసే ప్రచారం కారణంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ఏ మంత్రి తొందరపడి మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ.. కడియం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి మరీ బుక్ అయినట్లుగా చెబుతున్నారు.  టైం బాగోలేదని ఇందుకే అంటారేమో..?
Tags:    

Similar News