డిప్యూటీ సీఎం:మాట‌మార్చే అవ‌కాశం లేదా?

Update: 2015-09-21 09:14 GMT
తెలంగాణ‌ రాష్ట్ర మంత్రివర్గం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందజేసే నష్టపరిహారాన్ని రూ.లక్షన్నర నుంచి రూ.ఆరు లక్షలకు పెంచింది. పరిహారాన్ని ఆరు లక్షల దాకా పెంచిందన్న ఉప‌శ‌మ‌నాన్ని ప్రభుత్వం లేకుండా చేసిందని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ పెంపు శనివారం నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందని ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా  తెలిపింది. ఈ విష‌యంలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మ‌రోమారు పాత మాటే చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 జూన్‌ నుండి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులు 1300 మంది. పోలీసులు - రైతుల కుటుంబసభ్యులు - గ్రామస్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రైతుల ఆత్మహత్యలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం శనివారం నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకే పెంచిన ఆరు లక్షల నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపింది. అంతకు ముందు చనిపోయిన వారికి ఈ పెంపుదల వర్తించదని స్పష్టం చేసింది. గతంలో చనిపోయిన 141 మంది రైతు కుటుంబాలకు రూ.లక్షన్నర అందజేశామని, ఆ కుటుంబాలకు పెంచిన పరిహారం అమలుకాదని తెలిపింది. ప్రభుత్వ లెక్కల్లో 409 మంది రైతులే చనిపోయారని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అందులో నిబంధనల ప్రకారం చనిపోయింది 141 మందే ఉన్నారని, వారికి మాత్రమే రూ.లక్షన్నర ఎక్స్‌గ్రేషియా(పరిహారం) అందించామని అన్నారు. మిగతా వారు రైతులే అయినా వారంతా వివిధ కారణాలతో చనిపోయినందున వారికి నష్టపరిహారం వర్తించదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఈ విష‌య‌మై ఉప‌ముఖ్య‌మ‌త్రి క‌డియం శ్రీ‌హ‌రిని మ‌రోమారు మీడియా సంప్ర‌దించ‌గా... జీవో ఆధారంగానే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గ‌తంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ వారికి ఈ పెంపు వర్తించదని, గ‌తంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్ప‌టికే రూ.లక్షన్నర సాయాన్ని అందించామని తెలిపారు. ప్ర‌భుత్వ‌ నిర్ణయం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వ విధానాలు సరిగా ఉంటే, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని, ఇతర ఆర్థిక సమస్యలతో చనిపోయినవారంతా రైతులు కాదా అని పలు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.

ప్రభుత్వం గత సంవత్సరం 2014 జూన్‌ రెండు నుండి ఈ ఏడాది జులై 24 వరకు రైతుల ఆత్మహత్యల వివరాలను సేకరించింది. జులై 25 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఏ ఎక్స్‌గ్రేషియా కిందకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. వారిని నష్టపరిహారం లెక్కల్లో నుండి తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా రైతుల ఆత్మహత్యల వివరాలు సేకరిస్తున్నామని చెప్పినప్పుడు, ఇంతవరకే ఉన్నారని ఎలా చెప్పగలుగుతారని రైతుసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి, పెంచిన నష్టపరిహారాన్ని గతంలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని వివిధ రాజకీయపార్టీలు - రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
Tags:    

Similar News