ఏపీలో వరుస అత్యాచారాలకు కారణం కాకాణికి తెలిసిపోయిందోచ్

Update: 2022-05-05 02:55 GMT
దరిద్రపుగొట్టు రాజకీయం అన్నాక.. ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం అన్నది మామూలు విషయమైంది. అలాంటి రాజకీయం సైతం సిగ్గుపడే పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొని ఉన్నాయి. ఇక్కడి రాజకీయ వైరం వ్యక్తిగత కక్ష గా మారటమే కాదు.. ఎవరికి వారు తమ ప్రత్యర్థుల మీద అధిక్యతను ప్రదర్శించటానికి దేనికైనా రెఢీ అన్నట్లుగా తయారయ్యారు. ఇక.. అధికారం చేతిలో ఉన్న వారి సంగతి చెప్పాల్సిన అవసరమే కాదు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన ఏపీకి ఏమైందో కానీ.. కొద్ది రోజులుగా వరుస పెట్టి అత్యాచార దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇలాంటివాటిపై కఠిన చర్యలు తీసుకోవటం ద్వారా నేరస్తులకు వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో బాధితుల విషయంలో వారికి.. వారి కుటుంబాలకు సాంత్వన కలిగేలా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంది. అయితే.. అత్యాచార బాధితులు వేదనతో కుమిలిపోతున్న వేళ.. వారిని ఓదార్చి.. వారికిన్యాయం చేయాల్సిన స్థానే.. అత్యాచారాలకు కారణం మీరేనంటూ విపక్షంపై అధికారపక్షం గురి పెట్టిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. అదే సమయంలో.. అత్యాచార లాంటి దారుణ నేరాలు.. అనుకోకుండా జరిగినవిగా పేర్కొంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు చూస్తే.. ఇలాంటి పరిస్థితి ఏపీలో తప్పించి మరెక్కడా ఉండదేమోనన్న భావన కలుగక మానదు. తాజాగా ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనంగా చెప్పాలి.

రాష్ట్రంలో వరుసగా సాగిపోతున్న అత్యాచారాలకు.. దారుణ నేరాల వెనుక ఏదైనా కుట్ర ఉండి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'నేను అనుకుంటున్నదేమంటే.. తెలుగుదేశం పార్టీ ఒక పద్దతి ప్రకారం.. ప్లాన్ ప్రకారం కానీ.. ప్రణాళిక ప్రకారం కానీ వాళ్లకు చెందిన వారు ఇలాంటివి చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేస్తున్న ముద్దాయిల్ని చూస్తే తెలుస్తుంది. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని గందరగోళం చేయటం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పేలా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారు.

అక్రమాలకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయేసరికి ఆరాచకానికి పాల్పడుతున్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాల్ని చేస్తోంది. దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే.. దర్శకత్వం ఎవరన్నది తెలిసిందే. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే.. దీని వెనుక ఉన్న కుట్ర బయటకు వచ్చే వీలుంది" అని వ్యాఖ్యానించారు. ఎంత ప్రతిపక్షం అయినప్పటికి దారుణ నేరాలకు పాల్పడే వారిని పార్టీలో ఉంచుకోవటంద్వారా నష్టమే తప్పించి లాభం కాదన్న చిన్న లాజిక్ వదిలేసి మరీ టీడీపీ పై విరుచుకుపడ్డారు మంత్రి కాకాణి.

ఇదే సమయం లో.. రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సామూహిక అత్యాచారం గురించి ఏపీ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలు షాక్ కు గురి చేయటమే కాదు.. ఒక మహిళా మంత్రి నోటి నుంచి అత్యాచారం లాంటి దారుణ నేరాల విషయంలో ఇలా కూడా స్పందిస్తారా? అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. రేపల్లె ఆరాచక ఉదంతం గురించి మాట్లాడిన మంత్రి వనిత.. "అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి" అని వ్యాఖ్యానించటం తెలిసిందే.

సున్నితమైన అంశాన్ని తానేటి వనిత ఒకలా విశ్లేషిస్తే.. జగన్ పార్టీకి చెందిన మరో మంత్రి కాకాణి మాత్రం.. ఏపీలో జరుగుతున్న వరుస అత్యాచార ఉందంతాల వెనుక విపక్షాల పాత్ర ఉందని వ్యాఖ్యానించటం చూస్తే.. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న దాని కంటే కూడా.. జరిగిన దారుణాలతో తమకు జరిగిన డ్యామేజ్ ను భర్తీ చేసుకోవటానికి ఇష్యూను రాజకీయంగా మార్చాలన్న ఆలోచనే కనిపిస్తుంది. ఇలాంటి తీరు ఏపీ మీద ఉన్న చిన్నచూపును మరింత ఎక్కువయ్యేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News