అనూహ్యంగా గెలిచి మంత్రి అయ్యారు - ఈ సారి గెలుస్తారా?

Update: 2019-05-14 06:34 GMT
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా - కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూల దిన పత్రికలో జర్నలిస్టుగా  పని చేస్తూ ఉండటం అనే  అర్హతతో ఆ పార్టీ తరఫున ఎంపీ టికెట్ పొంది గెలిచిన వ్యక్తి కాలువ శ్రీనివాసులు. అయితే ఎంపీగా ఒకసారి నెగ్గినా  ఆ తర్వాత కాలువ రాజకీయం ధాటిగా సాగలేకపోయింది.  గత ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  అయ్యారు. ఆ సీట్లో కాలువ గెలుస్తారని ఎవరూ అనుకోలేదు!

ఎందుకంటే..అంతకు ముందు రెండేళ్ల కిందట జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాపు రామచంద్రారెడ్డి భారీ మెజారిటీతో నెగ్గారు. కాలువ కూడా అక్కడ అయిష్టంగానే పోటీ చేశారని స్థానికులు అంటారు. అయితే అనూహ్యంగా గెలవడం - జాక్ పాట్ గా మంత్రి అయిపోవడం జరిగింది!

మంత్రి అయ్యాకా కాలువ నియోజకవర్గాన్ని డెవలప్ ఏ మేరకు చేశాడో కానీ ఆయనపై అవినీతి ఆరోపణలు మాత్రం గట్టిగా వచ్చాయి. ఒకదశలో ఆయన రాయదుర్గం నుంచి పోటీ నుంచి తప్పుకుంటారని - వేరే నియోజకవర్గానికి వలస వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే చివరకు కాలువకు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కింది.

ఇక గత ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని - రాయదుర్గంలో తిరిగి వైఎస్సార్సీపీ జెండా పాతాలని కాపు రామచంద్రారెడ్డి కూడా గట్టిగానే కష్ట పడ్డారు ఈ సారి.మరోవైపు తెలుగుదేశం పార్టీలో లుకలుకలు రేగాయి. సీనియర్ నేత మెట్టు గోవిందరెడ్డి ఆఖర్లో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీపక్ రెడ్డి తనకు టికెట్ దక్కలేదని అలిగారు. అయితే వాళ్ల బంధువు జేసీ పవన్  అనంతపురం ఎంపీగా పోటీ చేయడంతో తప్పనిసరిగా ఆయన పార్టీ తరఫున తిరిగారు. అయితే ఆయన కాలువ  విజయం గురించి  మేరకు పని చేసి  ఉంటారో చెప్పలేని పరిస్థితి.

ఇక తెలుగుదేశం పార్టీ రెండు వేల  పద్నాలుగులో ఇక్కడ గెలిచిందంటే అప్పుడు రుణమాఫీ వంటి హామీ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ హామీ అమలు అంతంతమాత్రమే కావడంతో ఈ సారి  అలాంటి ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఎదుర్కొనాల్సి ఉందక్కడ.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బోయ అభ్యర్థి తలారి రంగయ్యను నిలబెట్టింది. రాయదుర్గం ప్రాంతంలో బోయల జనాభా గట్టిగా ఉంటుంది. కాలువ శ్రీనివాసులు అదే కులమే. రంగయ్య ప్రభావంతో ఎంతో కొంత కాలువకు  దెబ్బ పడి ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఈ సారి కాలువ నెగ్గుతారా? అనేది చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు కేబినెట్ మంత్రుల్లో చాలా మంది తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, ఓడే ప్రముఖుల్లో మంత్రులే ముందుంటారనే టాక్ నడుస్తోంది.  ఇలాంటి నేపథ్యంలో కాలువ శ్రీనివాసులు కథేంటి అనేది మే 23 న తేలాల్సిందే!
Tags:    

Similar News