మంత్రిగారి విజయావకాశాలు హరించుకుపోయాయా!

Update: 2019-03-13 04:37 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ - సమాచార - పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఈసారి చుక్కెదురు కానుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత 2014 ఎన్నికల్లో అనూహ్యంగా రాయదుర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కాలవ శ్రీనివాసులు అనంతరం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గా.. మంత్రిగా ఉన్నారు. అయితే త్వరలో జరిగే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులుకు రాయదుర్గం టికెట్‌ పార్టీ అధిష్టానం మరోసారి ఖరారు చేయడంతో స్థానిక టీడీపీ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

కాలవ శ్రీనివాసులుకు టికెట్‌ ఇవ్వడంపై పార్టీ అధిష్టానంపై రాయదుర్గంలోని టీడీపీ సీనియర్‌ నాయకులు - ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి తప్పుబట్టారు. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్‌ సీపీలో చేరుతానని ప్రకటించారు. అదేవిధంగా మరో నాయకుడు దీపక్‌ రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులు విజయం అంత సులువు కాదని తెలుస్తోంది.
 
గత 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగడంతో కాలవ శ్రీనివాసులు స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి సొంత పార్టీ నుంచి తిరుగుబాటుదారు ఎదురు కావడంతో కచ్చితంగా ఓడిపోతారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. దీనికి తోడు రాయదుర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా వరుసగా రెండుసార్లు గెలవలేదు. ఈ సెంటిమెంట్‌ కూడా కాలవ శ్రీనివాసులు వ్యతిరేకంగానే ఉంది. గత 1989 నుంచి పరిశీలిస్తే 2014 వరకు ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు గెలిచిన చరిత్ర లేదు. ప్రతి సారి గెలుపు మారుతూనే ఉంది.
 
జర్నలిస్టుగా వృత్తి ప్రారంభించిన కాలవ శ్రీనివాసులు తొలుత 1999లో టీడీపీ తరఫున అనంతపురం పార్లమెంట్‌ కు పోటీ చేసి గెలిచారు. తర్వాత 2004 - 2009లో ఓడిపోయారు. 2014లో రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గ్రామీణ గృహ నిర్మాణ - సమాచార - పౌరసంబంధాల శాఖ మంత్రిగా ఉన్నారు.

రాయదుర్గం

2014 - కాలవ శ్రీనివాసులు (టీడీపీ)
2009  - కాపు రామచంద్రారెడ్డి (కాంగ్రెస్‌)
2004 - మెట్టు గోవిందరెడ్డి (టీడీపీ)
1999 - పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
1994 - బండి హులికుంటప్ప (టీడీపీ)
1989 - పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
Tags:    

Similar News