ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నారట

Update: 2016-10-02 16:23 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నమన్న విషయం తెలిసిందే. ఆయన ఎవరినీ పట్టించుకోరు. ఏ విమర్శల్ని సీరియస్ గా తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. తనకు రాజకీయ ప్రత్యర్థులైన వారితో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించని కేసీఆర్.. వారికి సమయం ఇవ్వటానికి కూడా అస్సలు ఇష్టపడరు. నిజానికి విపక్ష ఎమ్మెల్యే విషయంలో ముఖ్యమంత్రులు ఎలా ఉంటారన్న దానికి ఒక్కో ముఖ్యమంత్రి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. అయితే.. ఎవరైనా సరే.. తమ పార్టీకి చెందని ఎమ్మెల్యే ఒకటికి నాలుగుసార్లు కలిసే ప్రయత్నం చేస్తే.. తప్పనిసరిగా టైమిచ్చి వారి చెప్పేది వినేందుకు ప్రయత్నిస్తారు.

కానీ.. కేసీఆర్ అందుకు భిన్నం. ఆయన ఒక్కసారి ఫిక్స్ అయితే.. ఆయన్ను కలవటం అంత తేలికైన విషయం కాదు. ఎమ్మెల్యే ఏమిటి? విపక్ష పార్టీకి చెందిన కీలక నేతలు టైమ్ అడిగితేనే స్పందించని తీరు కేసీఆర్ లో ఉంటుంది. ఈ విషయాన్ని ఆయా పార్టీలకు చెందిన నేతలే స్వయంగా చెప్పుకొని వేదన చెందిన పరిస్థితి. ఎదురు పడినప్పుడు చక్కగా పలుకరించే అలవాటున్న కేసీఆర్.. విడిగా కలిసేందుకు ప్రయత్నించిన వారికి టైమిచ్చేందుకు పెద్దగా ఇష్టపడరు.

విపక్ష పార్టీ ముఖ్యనేతలకే టైమివ్వని కేసీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఒక యువ ఎమ్మెల్యేకు టైమిస్తారా? అంటే సమాదానం తెలిసిందే. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి టైంను పదే పదే అడిగి విసిగిపోయిన మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తాజాగా తన ఆవేదనను బయటకు చెప్పేశారు.

ప్రజలకు సేవ చేయటానికి వైద్య విద్యను వదిలిపెట్టి మరీ రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ.. రాజకీయాల్లో పరిస్థితిని చూస్తే బాధ కలుగుతుందన్న ఆవేదనను వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు టైం అడుగుతున్నానని.. నెలలు గుడుస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం టైమివ్వటం లేదని వాపోయారు. ‘‘ఆయన తీరు నియంతను తలపిస్తోంది. అలాంటి వ్యక్తి ఉన్న శాసనసభలో సభ్యుడిగా ఉన్నందుకు చింతిస్తున్నా. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు’’ అని వాపోయారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తున్న వంశీచంద్ కు సీఎం చుక్కలు చూపిస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News