పొలిటికల్ హైవే మీదకు కమల్?

Update: 2017-03-06 04:47 GMT
తమిళనాడులోమరో సంచలనానికి తెర లేవనుందా? ప్రముఖసినీ నటుడు కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఒకదశలో తమిళనాడులో ఉండేందుకు సైతం ఇష్టపడని ఆయన.. ఇప్పుడు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో తన పని తాను అన్నట్లుగా ఉండే కమల్.. అమ్మ మరణం తర్వాత మాత్రం ఆయనలో మార్పు చాలా స్పష్టంగా వచ్చిందంటున్నారు.

సామాజిక అంశాలు.. రాజకీయ అంశాల మీద ఎప్పటికప్పుడు రియాక్ట్ కావటమే కాదు.. తీవ్రస్థాయిలో మండిపాటు.. ధర్మాగ్రహాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించి అందరి నోటా నానారు. హాట్ టాపిక్ అయ్యారు . ఈ మధ్యన ఉధృతంగా సాగిన జల్లికట్టు ఇష్యూ సందర్భంగా తన మద్దతును ఇవ్వటమే కాదు.. ఈ అంశంపై ఆయన బలంగా రియాక్ట్ కావటాన్ని మర్చిపోకూడదు.

సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయటం.. ఆపై చిన్నమ్మ సీఎం అయ్యేందుకు ప్రయత్నించటం.. దాన్ని అడ్డుకునేందుకు పన్నీర్ ప్రయత్నాలు చేయటం.. ఈ దశలో తెర మీదకు వచ్చిన చిన్నమ్మ విధేయుడు పళనిస్వామి పైనా కమల్ చేసిన ట్వీట్లు చేసి.. తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేసి.. మరింతమంది తమ అభిప్రాయాల్ని బాహాటంగా చెప్పేలా చేయటంలో ముందున్నారు. కమల్ లో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎందుకిలా స్పందిస్తున్నారు? అన్న ప్రశ్నలు వేసుకుంటే.. ఆయన రాజకీయాల బాట పట్టాలని భావిస్తున్న మాట బలంగా వినిపిస్తోంది.  

రాజకీయాలంటే తనకు తెలీవని.. అలాంటి ఆలోచన కూడా లేదని.. ప్రజల మేలు కోరుకోవటంలో భాగంగానే తాను కొన్ని విషయాలపై స్పందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. తాజాగా ఆయన నివాసంలో కొన్ని సంస్థల ప్రతినిధులు.. న్యాయవాదులతో జరిపిన సుదీర్ఘ చర్చలు జరపటంతో.. ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల కమల్ రీతిలోనే ఆయన అభిమాని ఒకరు విమర్శలు చేయటం.. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయటంపై లోక నాయకుడు కలత చెందినట్లుగా చెబుతున్నారు. తన అభిమాని అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన కమల్.. ప్రజలు తనవైపు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా.. చెన్నై అళ్వార్ పేట ఎల్డామ్స్ రోడ్డులోని తన ఆఫీసులో అభిమాన సంఘాలతో నిర్వహించిన సమావేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకూ సాగిన సుదీర్ఘ సమావేశంలో రాజకీయాల గురించి చర్చ జరిగినట్లుగా చెబుతున్నప్పటికీ.. అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా.. కమల్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ఆసక్తికర సమాచారం త్వరలో వస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగినట్లేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News