అదిగదిగో కమల్ రాజకీయ యాత్ర!

Update: 2018-01-17 07:07 GMT
అయితే ఈ రాజకీయ యాత్ర మన తెలుగు రాజకీయాలకు సంబంధించినది మాత్రం కాదు. కానీ తెలుగు ప్రజలందరికీ కూడా పుష్కలంగా ఆసక్తి కలిగించేది. తమిళ రాజకీయాల్లో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించి.. ఒకేసమయంలో ఇద్దరు సూపర్ స్టార్లు... అభిమానుల్ని ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ విషయంలో పార్టీ ప్రకటించబోయే ముహూర్తం కూడా ఖరారైంది. పార్టీని ప్రకటించిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయడానికి కూడా కమల్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం వస్తోంది.

చాన్నాళ్ల కిందటే రాజకీయ ఆగమనం గురించి స్పష్టత ఇచ్చేసి.. తన అభిమానులు అందరినీ కూడా సిద్ధంగా ఉండమని చెప్పిన కమల్ హాసన్.. తాజాగా తేదీ కన్ఫర్మ్ చేశారు. ఆ ప్రకారం ఫిబ్రవరి 21వ తేదీన కమల్ రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఆయన యాత్ర కూడా అదే రోజున ప్రారంభం అవుతుందిట. రాష్ట్రంలోని ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా తన యాత్ర సాగుతుందని కమల్ హాసన్ వెల్లడించారు.

మొత్తానికి యాత్రలే.. ప్రజలను అర్థం చేసుకోవడానికి మంచి మార్గమని.. ప్రజల మనసులను గెలుచుకోవడానికి కూడా అవే బాటలు వేస్తాయని నిరూపించడానికి మరో భావి నాయకుడు సిద్ధం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. కమల్ హాసన్ తన పార్టీ ప్రకటన, యాత్రకు సంబంధించి అప్పుడే ఏర్పాట్లలో పడ్డట్లుగా కనిపిస్తోంది. ఆయన జన్మస్థలం అయిన రామనాథపురం నుంచి యాత్ర ప్రారంభించబోతున్నట్లుగా కమల్  ప్రకటించారు. మధురై, దిండిగల్, శివగంగ జిల్లాల్లో ఆయన తొలివిడత యాత్ర సాగుతుంది. అక్కడికి ఫస్ట్ షెడ్యూల్ ముగుస్తుందని అనుకోవాలి.

కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి.. తొలివిడత యాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను మధించి క్రోడీకరించుకున్న తరువాత.. యాత్రలో గానీ, రాజకీయంగా గానీ.. ఎదురవుతున్న సమస్యలను కాస్త బేరీజు వేసుకున్న తర్వాత.. మళ్లీ రెండో విడత యాత్ర మొదలవుతుంది.

మన రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పాదయాత్ర సాగిస్తున్నారు. కమల్ ప్రకటించిన యాత్ర కూడా అదే తరహాలో.. అదే లక్ష్యాలతో సాగుతోంది. కాకపోతే.. జగన్ ఏక బిగిన ఎలాంటి విరామాలు లేకుండా.. రాష్ట్రమంతా కాలినడకన చుట్టే ప్రయత్నం చేస్తోంటే.. కమల్ హాసన్ విడతలుగా యాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి కొత్త రాజకీయ పార్టీకి ఆ పద్ధతే కరెక్టేనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News