అదేదో ముందే ఏడిస్తే స‌రిపోయేది క‌దా క‌మ‌ల్!

Update: 2019-05-17 07:13 GMT
తొంద‌ర‌ప‌డి నోరు జారి.. దాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌టానికి నానా పాట్లు ప‌డ‌టం మామూలే. తాజాగా ప్ర‌ముఖ‌ న‌టుడు క‌మ్ మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు క‌మ‌ల్ హాస‌న్ అలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారు. హిందూ తీవ్ర‌వాదం అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌నానికి తెర తీయ‌ట‌మే కాదు.. ఆయ‌న‌మీద పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. కాసిన్ని ఓట్ల కోసం దుర్మార్గ‌మైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ప‌లువురు మండిప‌డుతున్నారు.

రాజ‌కీయం కోసం ఇంత దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్న ప‌లువురు.. ఆయ‌న‌పై దాడి చేసేందుకు వెనుకాడ‌టం లేదు. ఆయ‌న పాల్గొన్న స‌భ‌ల్లో భార‌త్ మాతాకీ జై అన్న నినాదాలు చేస్తూ.. ఆయ‌న‌పై ప‌లువురు కోడిగుడ్లు.. చెప్పులు విసిరారు. ఆయ‌న వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న‌పై జ‌రుగుతున్న దాడులు.. వ‌స్తున్న బెదిరింపుల‌కు తాను త‌గ్గేది లేద‌న్న ఆయ‌న‌.. తాను భ‌య‌ప‌డ‌న‌ని చెబుతున్నారు.

కాకుంటే.. త‌న వ్యాఖ్య‌ల‌పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను క‌మ‌ల్ గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దీనికి నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.  అన్ని మ‌తాల్లో తీవ్ర‌వాదులు ఉన్నార‌ని.. ఎవ‌రూ త‌మ‌కు తాము ప‌విత్రుల‌మ‌ని చెప్పుకోలేర‌న్నారు. ప్ర‌జ‌ల్లో శాంతిని నెల‌కొల్ప‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని.. అందుకోసం హిందూ.. ముస్లిం.. క్రైస్త‌వులు ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న‌ట్లు చెప్పారు.

క‌మ‌ల్ చెప్పినట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే..గాడ్సేను ఉగ్ర‌వాదిగా అన‌టంలో ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌వు. కానీ.. ఆయ‌న మొట్ట‌మొద‌టి హిందూ ఉగ్ర‌వాది అన్న మాట‌తోనే అంద‌రి అభ్యంత‌ర‌మంతా. ఒక‌వేళ హింస గురించి చెప్పాల‌న్న‌దే క‌మ‌ల్ ఆలోచ‌న అయితే.. మ‌తాన్ని తీసుకురావాల్సిన అవ‌స‌రం ఏమిటి?  శాంతిని నెల‌కొల్ప‌ట‌మే క‌మ‌ల్ ల‌క్ష్య‌మైతే.. అలాంటివాళ్లు మ‌తాల గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇంత క‌వ‌రింగ్ లేకుండా మాట్లాడిన త‌ప్పుడు మాట‌ల‌కు చెంప‌లేసుకుంటే స‌రిపోయే దానికి భిన్నంగా ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఆయ‌న ఇమేజ్ ను మ‌రింత డ్యామేజ్ చేస్తాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

Tags:    

Similar News