క‌మ‌ల్ పొలిటిక‌ల్ ఎంట్రీ ప‌క్కానేన‌ట‌!

Update: 2017-08-31 07:51 GMT
త‌మిళ‌నాడుతో పాటు తెలుగు నాట... ఇంకా చెప్పాలంటే దేశ‌వ్యాప్తంగా సినీ రంగంలో ఓ స్థాయికి ఎదిగి పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంద‌నే చెప్పాలి. అయితే ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల్లో దేశంలోనే త‌మిళ‌నాడుతో పాటు తెలుగు నేల‌కు ప్ర‌త్యేక‌త ఉంద‌నే చెప్పాలి. ఎందుకంటే... త‌మిళ‌నాట ఎంజీఆర్‌ - జ‌య‌ల‌లిత‌ - ఇప్ప‌టికీ బ‌తికే ఉన్న క‌రుణానిధి సినిమాల్లో మాదిరే రాజ‌కీయ య‌వ‌నిక‌పై త‌మ‌దైన ముద్ర వేశారు. ఇక తెలుగు నాట అన్న‌గారిగా ముద్ర‌ప‌డిపోయిన స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్ర‌హ‌తిహాత ప‌య‌నం, రాజ‌కీయాల్లో సినిమా స్టార్లు సాధించిన గొప్ప విజ‌యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు.

ఇప్పుడు ఎంజీఆర్ లేరు... ఎన్టీఆర్ లేరు... జ‌య‌లలిత కూడా లేరు. ఉన్న‌దంతా ఒక్క క‌రుణానిధి మాత్ర‌మే. క‌రుణ కూడా త‌న చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో జ‌య మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాట ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్య‌త‌ను పూరించేందుకు అటు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో పాటు అక్క‌డి సినీ ఇండ‌స్ట్రీకే చెందిన మ‌రో ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తీవ్రంగా య‌త్నిస్తున్న‌ట్లు చాలా రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌న రాజ‌కీయ తెరంగేట్రానికి ర‌జ‌నీ పావులు క‌దుపుతుండ‌గా... తాను వ‌స్తానో - రానోన‌న్న విష‌యాన్ని నిర్ధారించుకోక‌ముందే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేసిన కమ‌ల్ హాస‌న్... త‌మిళ తంబీల‌ను అయోమ‌యంలో ప‌డేశాయ‌నే చెప్పాలి. ర‌జ‌నీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో క‌మ‌ల్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ముందుకు వ‌స్తూ... త‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి సంబంధించి కొంత కొంత‌గానే క్లారిటీ ఇస్తున్నారు.

ఈ క్ర‌మంలో నిన్న ఓ అభిమాని వివాహానికి హాజ‌రైన సంద‌ర్భంగా మ‌రోమారు నోరు విప్పిన క‌మ‌ల్‌... త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై మ‌రింత క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో త‌న రాజ‌కీయ  అరంగేట్రం ఖాయ‌మేన‌ని చెప్పేసిన కమ‌ల్‌... తాను ఎప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌న్న విష‌యాన్ని మాత్రం పేర్కొన‌లేదు. అంతేకాకుండా సొంత పార్టీతో వ‌స్తారా? ఇప్ప‌టికే ఉన్న పార్టీలో చేరతారా? అన్న విష‌యంపైనా ఆయ‌న స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయినా ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... మెరుగైన సమాజ నిర్మాణమే తన లక్ష్యమని, ఈ దిశగా, తనతో కలసి నడిచేందుకు యువత కదలి రావాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతామని పేర్కొన్న కమల్, ఎవరూ తమ ఓట్లను డబ్బు తీసుకుని వేయరాదని కోరారు. కాగా, కమల్ మాటలతో ఆయన రాజకీయ ప్రవేశంపై మరింత స్పష్టత వచ్చినట్లయింది. అయితే, కొత్త పార్టీ పెడతారా? లేక ప్రస్తుతమున్న ఏదైనా జాతీయ లేదా స్థానిక పార్టీలో చేరతారా? అన్న విషయాన్ని కమల్ ప్రస్తావించలేదు.
Tags:    

Similar News