లోక నాయకుడి ఓటు మాతృభాషకే!

Update: 2022-05-17 09:43 GMT
లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు.. ఇలా రెండు పడవల మీద విజయవంతంగా ప్రయాణిస్తున్నారు. తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల ముందు మక్కల్‌ నీది మయ్యమ్‌ పేరుతో పార్టీ స్థాపించారు.. కమల్‌. గత ఎన్నికల్లో తమిళనాడులోని రెండో పెద్ద నగరం కోయంబత్తూరు సౌత్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా సరే రాజకీయాల్లో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యమ్‌ 3.78 శాతం ఓట్లు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.62 శాతం ఓట్లు సాధించింది. అయితే.. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరు కూడా ఆ పార్టీ తరఫున గెలుపొందలేదు.

మొదటి నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, బీజేపీ మతతత్వ రాజకీయాలపై కమల్‌ హాసన్‌ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు పలుమార్లు బీజేపీ శక్తుల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొన్నారు. అయినా సరే కమల్‌ తన మాటల దాyì  నుంచి Ðð నక్కి తగ్గడం లేదు. గతంలో జయలలిత జీవించి ఉన్నప్పుడు ఆమెతోనూ వైరం నడిపారు.

తాజాగా హిందీని జాతీయ భాషగా చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై కమల్‌ హాసన్‌ మండిపడ్డారు. తన మాతృభాష తమిళానికి అడ్డు వస్తే హిందీని తప్పకుండా వ్యతిరేకిస్తానన్నారు. మాతృభాష మాట్లాడేవాడిగా తమిళం వర్థిల్లాలి అని చెప్పడం తన బాధ్యత అని చెప్పారు. తమిళానికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా అని స్పష్టం చేశారు. దీనికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి వ్యక్తి తన మాతృభాషను మాట్లాడటం మరిచిపోవద్దని కోరారు.

ఇప్పటికే ఇదే విషయమై కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఎన్నో భాషలున్నాయని.. ఎవరి మాతృభాషలో వారిని మాట్లాడుకోనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎవరికైనా ఏదైనా భాష నేర్చుకోవాలనిపిస్తే వారే ఇష్టపూర్వకంగా నేర్చుకుంటారు కానీ బలవంతంగా రుద్దడం సరికాదన్నాడు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ సుదీప్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇక తమిళమే దేశంలోకెల్లా ప్రాచీన భాష అని, తమిళం నుంచే అన్ని భాషలు పుట్టాయని భావిస్తుంటారు.. తమిళులు. తమిళ భాషకు, తమిళ సాహిత్యానికి, తమిళ ఆచార వ్యవహారాలకు ప్రాణం ఇస్తారు. తమిళం విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులదీ ఒకే మాట.. బాటగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం కమల్‌ హాసన్‌.. శంకర్‌ దర్శకత్వంలో భారతీయుడు –2, లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విక్రమ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు.
Tags:    

Similar News