దృష్టి మ‌ళ్లించేందుకు విగ్ర‌హాలు కూల్చేస్తున్నారు

Update: 2018-03-07 11:57 GMT
త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయిన 48 గంటల్లోపే వారి రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోయి...భారీగా హింసాకాండకు దిగి కారల్ మార్క్స్ - లెనిన్ విగ్రహాలను కూల్చివేసిన తీరు వివాద రూపం దాల్చుతోంది. ఇప్ప‌టికే ఈ ప‌రిణామంపై ఆయా రాజ‌కీయ పార్టీలు స్పందించ‌గా...ద్రావిడ ఉద్యమనేత పెరియార్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనపై రాజకీయవేత్తగా మారిన ఫిల్మ్ హీరో కమల్‌హాసన్ స్పందించారు. పెరియార్ విగ్రహాలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా పోలీసులను మోహరించాల్సిన అవసరం లేదన్నారు. పెరియార్ విగ్రహాలను తమిళులు రక్షించుకుంటారన్నారు. కానీ కావేరీ జల వివాదాన్ని పక్కదోవ పట్టించేందుకే ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నట్లు కమల్ ఆరోపించారు.

కావేరీ మానేజ్‌మెంట్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని క‌మ‌ల్ డిమాండ్ చేశారు. కీలకమైన సమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన మీడియాను కోరారు. పక్కా ప్లాన్ ప్రకారం విగ్రహాల ధ్వంసం జరుగుతున్నట్లు కమల్ ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై సీరియస్‌గా ఉంటే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు సీపీఎం కార్యకర్తలు చెన్నైలోని బీజేపీ ఆఫీసు ముందు ధర్నా చేశారు. బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీఎంకే నేత కనిమొళి డిమాండ్ చేశారు.  

కాగా, త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసినట్లే తమిళనాడులో కులవాది అయిన పెరియార్ విగ్రహాన్ని కూల్చివేస్తామని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు హెచ్ రాజా పేర్కొన్న కొద్ది గంటల్లో బీజేపీ కార్యకర్తలు కార్యాచరణకు దిగి. వెల్లూరులోని మున్సిపల్ కార్యాలయంలో గల పెరియార్ విగ్రహాన్ని రాత్రి 9 గంటల సమయంలో వారు ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే. `లెనిన్‌ కు భారత్‌ తో ఏం సంబంధం? కమ్యూనిజానికి - భారత్‌ కు సంబంధం ఏమిటి?` అని రాజా తన ఫేస్‌ బుక్ ఖాతాలో ప్రశ్నించారు. త్రిపురలో లెనిన్ విగ్రహానికి పట్టిన గతే పెరియార్ విగ్రహాలకు పడుతుందని పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తడంతో తర్వాత ఫేస్‌ బుక్ పోస్ట్‌ ను తొలిగించారు.
Tags:    

Similar News