మోడీని తిట్టే కమల్ హాసన్ ఇలా చేశాడేంటి?

Update: 2019-10-12 09:38 GMT
ప్రధాని మోడీ అన్నా.. బీజేపీ అన్నా..  ఒంటికాలిపై లేచే విలక్షణ నటుడు - మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆశ్చర్యపరిచాడు. మోడీని  ఈ విషయంలో వ్యతిరేకించవద్దని.. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేయవద్దని తమిళులను - నిరసన కారులను కోరారు. మోడీపై ఎంతో వ్యతిరేకత చూపే కమల్ హాసన్ నోటి నుంచి ఈ డైలాగులు రావడం అందరినీ ఆశ్చర్యానికి.. షాక్ గురిచేశాయి.

మొన్నటికి మొన్న హిందీని దేశంలోని అన్ని భాషలపై రుద్దుతామని అమిత్ షా అనడంపై కమల్ హాసన్ రెచ్చిపోయారు. మోడీషాలను తూర్పారపట్టారు. అంతకుముందు కూడా మోడీని ఓడించాలని.. హిందుత్వ - మతతత్వ బీజేపీని చిత్తు చేయాలని సంచలనకామెంట్స్ తో హోరెత్తించారు. మోడీ అమలు చేసిన త్రిపుల్ తలాక్ సహా కశ్మీర్ నిర్భంధంపై కూడా కమల్ హాసన్ వ్యతిరేకించారు.

అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురం పర్యటన సందర్భంగా మోడీ ప్రవర్తించిన తీరును కమల్ కొనియాడారు. అచ్చ తమిళం సంస్కృతిలో తెల్లచొక్కా. పంచె కట్టి మోడీ చైనా అధ్యక్షుడికి తమిళ సంప్రదాయ ప్రకారం వ్యవహరించడం కమల్ ను ఫిదా చేసింది.దీనిపై కమల్ తాజాగా స్పందించాడు..

మోడీని వ్యతిరేకించే వారందరూ సైలెంట్ గా ఉండాలని.. మనమే ఓట్లు వేసి కమ్ అని చెప్పి ఇప్పుడు గోబ్యాక్ అనడం మంచిదికాదన్నారు. 60 ఏళ్ల తర్వాత ఒక చైనా అధ్యక్షుడిని మామల్లపురం తీసుకొచ్చిన మోడీ చర్యను ఒక చారిత్రక గొప్ప సంఘటనగా కమల్ అభివర్ణించాడు. ఇద్దరు దేశాధినేతలు తీసుకునే నిర్ణయాలు విజయవంతం కావాలన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తే విమర్శిద్దామని.. కానీ నిజాయితీగా వ్యవహరిస్తున్న మోడీని ప్రస్తుతానికి ప్రశంసిద్దామని కమల్ హాసన్ మెచ్చుకోవడం విశేషం.
   

Tags:    

Similar News