కమల్ యాక్షన్ లోకి దిగిపోయారండోయ్!
తమిళ నాట రాజకీయాల్లోకి దిగేశానంటూ ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించేసిన ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్... తాజాగా తన బాట ఏమిటో కూడా చెప్పేశాడు. ఇప్పటికే ప్రభుత్వ అవినీతి - సమకాలీన రాజకీయ నాయకుల వైఖరిపై నిప్పులు చెరుగుతూ... దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నేతలను కడిగి పారేస్తున్న కమల్... మొన్నామధ్య తనపై కత్తి పట్టుకుని వస్తున్న బాలుడి పోస్టర్ తో బాగానే హర్ట్ అయినట్టున్నాడు. ఆ ఫొటోపైనా తనదైన శైలిలో స్పందించేసిన కమల్... కల్మషం లేని అలాంటి చిన్నారుల చేతిలో ప్రాణాలు విడిచేందుకు తాను సంతోషిస్తానని కూడా సెటైర్లు సంధించాడు. తాజాగా రాజకీయాల్లో తన బాట ఏమిటనే విషయాన్ని విస్పష్టం చేస్తున్నట్లుగా ఆయన తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ ను మార్చేస్తూ... దానికి తనదైన శైలితో కూడిన ఓ కామెంట్ ను జోడించాడు.
తమిళనాడులో విప్లవ మహాకవిగా గుర్తింపు తెచ్చుకున్న భారతీ లాగే తానూ తయారై - అదే చిత్రాన్ని తన ఫ్రోఫైల్ ఫోటోగా పెట్టుకున్నారు. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం మీద ఆయన మరోసారి ఆరోపణలు చేశారు. మరోసారి ఆరోపణలు అనే కంటే కూడా పక్కా ఆధారాలతో కూడిన ఆరోపణలు చేశాడని చెప్పాలి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో జరిగిన అవినీతి ఇదే అంటూ స్వచ్చంద సంస్థ అరప్పూర్ సేకరించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో కమల్ విడుదల చేశారు. *తమిళనాడు ప్రభుత్వం అవినీతికి ఇంతకంటే ఇంకా ఏం సాక్షం కావాలి, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఉంది - థ్యాక్స్ ఆరప్పూర్ బ్రదర్స్* అంటూ కమల్ ట్వీట్ చేశారు.
అంతటితో ఆగని కమల్ *అమ్మ జయలలిత పాలన ప్రజలకు అందిస్తాం* అంటూ ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం చెబుతోందని, అంటే ప్రజలకు చెందిన రూ.60 కోట్లు లూటీ చేసేస్తుట్లేనా? అని ఘాటు ప్రశ్నను సంధించారు. *ఆరోపణలు చేసినందుకు నా మీద కేసు పెడుతారా?...పెట్టుకోండి, నా ఇల్లు చెన్నైలోని తేయాన్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోంది, నేను ఎక్కడికి పారిపోను* అంటూ మరింత హీటు పెంచేలా కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల ద్వారా జయలలిత రూ. 60 కోట్ల అక్రమాస్తుల కేసును కూడా ఆయన ప్రస్తావించినట్లైందన్న వాదన వినిపిస్తోంది. ఎతావతా చూస్తుంటే... కమల్ హాసన్ మున్ముందు ఎడప్పాడి సర్కారుకు పట్ట పగలే చుక్కలు చూపేలా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.