హ‌రిబాబుకు పార్టీ ప‌ద‌వితోనే స‌రిపెడ‌తారా?

Update: 2018-04-18 12:12 GMT

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌స్తుతం సాగుతున్న ఉద్య‌మం కార‌ణంగా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా డిమాండ్ తోనే నాలుగేళ్ల పాటు బీజేపీకి మిత్రప‌క్షంగా కొన‌సాగిన టీడీపీ... అక‌స్మాత్తుగా ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌గా... టీడీపీ కేబినెట్ లోని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేశారు. ఈ క్ర‌మంలో బీజేపీ - టీడీపీల మ‌ధ్య మాటల యుద్ధం న‌డుస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించిన త‌మ‌ను దోషిగా నిల‌బెట్టేందుకు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వేస్తున్న ఎత్తుల‌ను బీజేపీ నేత‌లు బాగానే చిత్తు చేస్తున్నారు. అస‌లు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబుకు ఆదిలోనే వెల్ల‌డించామని, దానికి ఆయ‌న కూడా స‌రేన‌న్నార‌ని, ఇప్పుడు మాత్రం మాట మార్చేస్తున్నారని చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదాపై మాట మార్చింది చంద్ర‌బాబేన‌ని, తాము ఎంత‌మాత్రం కాద‌ని కూడా వారు చెబుతున్న వైనం మ‌న‌కు  తెలియ‌నిదేమీ కాదు. అయినా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి తామేమీ వ్య‌తిరేకం కాద‌ని, 14వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌లే అడ్డంకిగా మారాయ‌ని, ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాకు స‌రిస‌మానంగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెబితే... చంద్ర‌బాబు స‌రేన‌న్న విష‌యాన్ని కూడా వారు బ‌హాటంగానే చెబుతున్నారు. ఇదంతా  బాగానే ఉన్నా.... బీజేపీలో చంద్ర‌బాబుకు అనుకూలుడిగా పేరున్న విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు రాజీనామా రాష్ట్ర రాజ‌కీయాల‌ను మ‌రోమారు వేడెక్కించింద‌ని చెప్పాలి. బాబుకు చెక్ పెట్టేందుకే హ‌రిబాబును బీజేపీ అధిష్ఠానం త‌ప్పించింద‌ని కొంద‌రంటుంటే... షెడ్యూల్ ముగిసిన కార‌ణంగానే హ‌రిబాబే రాజీనామా చేశార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పార్టీలో యువ నాయ‌క‌త్వానికి అవ‌కాశం ఇవ్వ‌డం, ఏపీలో పార్టీని మ‌రింత పురోభివృద్దిలోకి న‌డిపే నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం కోస‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని స్వ‌యంగా హ‌రిబాబే... పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు పంపిన రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.

స‌రే రాజీనామా అయితే జ‌రిగిపోయింది. మ‌రి హ‌రిబాబు ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యానికి వస్తే.. కేంద్ర మంత్రివ‌ర్గంలోకి హ‌రిబాబును తీసుకుంటార‌ని ప్ర‌చారం సాగింది. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి కంటే ఉన్న‌త‌మైన ప‌ద‌విని హ‌రిబాబుకు అందించ‌నున్న‌ట్లు కూడా పార్టీ పెద్ద‌లు చెప్పిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ రెండు వాద‌న‌ల‌కు భిన్నంగా హ‌రిబాబును పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మిస్తూ కాసేప‌టి క్రితం పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంది. టీడీపీ మంత్రుల రాజీనామాల‌తో ఖాళీ అయిన బెర్తుకు హ‌రిబాబును ఎంపిక చేస్తార‌ని భావించినా ఆ దిశ‌గా అధిష్ఠానం మొగ్గు చూప‌లేదు. అంతేకాకుండా రాష్ట్ర అధ్య‌క్ష ప‌దవి కంటే కూడా అంత‌గా ప్రాధాన్యం లేని పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా హ‌రిబాబును నియమించ‌డంపైనా ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం అసంతృప్తితో ఉన్నట్లు స‌మాచారం.
Tags:    

Similar News